Thursday, November 21, 2024

AP – టిడిపిలోకి ఏలూరు మేయ‌ర్ …

అమ‌రావ‌తి – ఏలూరులో వైసిపికి భారీ షాక్‌ తగిలింది. నగర మేయర్‌ నూర్జహాన్, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు దంపతులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ (చంటి) నేతృత్వంలో మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో సైకిల్ పార్టీలో చేరారు.

వారితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్‌, ప్రస్తుత వైసిపి పట్టణ అధ్యక్షుడు బి.శ్రీనివాస్‌, ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ ఎం.మైబాబుతో పాటు పలువురు నేతలు సైకిలెక్కారు. ఉండవల్లిలోని తన నివాసంలో వీరందరికీ మంత్రి లోకేశ్‌ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓటమి నుంచి జ‌గ‌న్ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.

ఏలూరు అభివృద్ధి కోసం కలిసి వచ్చే వారికి స్నేహ హస్తం అందిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఆళ్ల నాని తో పాటు ప‌లువురు వైసిపి కార్యకర్తలను వదిలేసి పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని టిడిపి లో చేర్చుకుంటున్నామని వెల్లడించారు. త్వరలోనే దశలవారీగా కార్పొరేటర్లు టిడిపిలో చేరబోతున్నారని తెలిపారు.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గతంలో తెలుగుదేశం వీడి వైసిపికి వెళ్లాల్సి వచ్చిందని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ అన్నారు. ఆ పార్టీలోకి వెళ్లాక ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయామన్నారు. దాదాపు 40మంది కార్పొరేటర్లు త్వరలోనే తెలుగుదేశంలో చేరనున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement