Friday, November 22, 2024

AP Elections – నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు అంతా రెడీ


రేప‌టి నుంచి 25 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌
ఆర్‌వో కార్యాల‌యాల్లో ప్ర‌త్యేక ఏర్పాట్లు
రాజకీయ పార్టీలకు పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాం
పొర‌పాట్ల‌కు ఆస్కారం లేకుండా ఆర్‌వోల‌కు మూడురౌండ్ల ప్ర‌త్యేక శిక్ష‌ణ‌
ఎన్నిక‌ల సిబ్బందికి నాణ్య‌మైన శిక్ష‌ణ ఇస్తున్నాం
మీడియాతో ఎన్టీర్‌ జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ డిల్లీరావు

ఆంధ్ర‌ప్ర‌భ‌, ఎన్టీఆర్ బ్యూరో : ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క‌మైన నామినేష‌న్ల ప్ర‌క్రియ ఈ నెల 18వ తేదీన‌ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థుల నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు రిట‌ర్నింగ్ అధికారుల కార్యాల‌యాల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన‌ట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.


న‌గ‌రంలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లోని స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ కార్యాల‌య ఎన్నిక‌ల మీడియా కేంద్రంలో బుధ‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో క‌లెక్ట‌ర్, జాయింట్ క‌లెక్ట‌ర్ పి.సంప‌త్ కుమార్‌తో క‌లిసి మాట్లాడారు. ఏప్రిల్ 18 ఉద‌యం 11 గంట‌లలోపు ఆర్‌వోల సంత‌కంతో తెలుగు, ఇంగ్లిష్‌లో నామినేష‌న్ల‌కు సంబంధించి ఫారం 1 ప‌బ్లిక్ నోటీస్ ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని.. దీన్ని జిల్లా, డివిజ‌న్‌, మండ‌ల‌, గ్రామ‌స్థాయిలోని ముఖ్య‌మైన కార్యాల‌యాల్లో ప‌బ్లిష్ చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.

- Advertisement -

నామినేష‌న్ల స్వీక‌ర‌ణ కేంద్రాలివే..

విజ‌య‌వాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గానికి క‌లెక్ట‌ర్ ఆర్‌వో కాబ‌ట్టి నామినేష‌న్ల‌ను క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా తిరువూరు నియోజ‌క‌వ‌ర్గానికి అక్క‌డి ఆర్‌డీవో ఆర్‌వోగా ఉన్నార‌ని ఈ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ఆర్‌డీవో కార్యాల‌యంలో నామినేష‌న్లు స్వీక‌రిస్తార‌న్నారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి కేఆర్ఆర్‌సీ స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ఆర్‌వ‌గా ఉన్నార‌ని.. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి ప‌శ్చిమ త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో నామినేష‌న్లు స్వీక‌రిస్తార‌ని వెల్ల‌డించారు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌వోగా ఉన్నార‌ని.. ఆయ‌న కార్యాల‌యంలో నామినేష‌న్లు స్వీక‌రిస్తార‌ని తెలిపారు. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి విజ‌య‌వాడ ఆర్‌డీవో ఆర్‌వోగా ఉన్నార‌ని.. నామినేష‌న్ల‌ను స‌బ్ కలెక్ట‌ర్ కార్యాల‌యంలోనూ, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి జాయింట్ క‌లెక్ట‌ర్ ఆర్‌వో ఉన్నార‌ని.. అక్క‌డి త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో నామినేష‌న్లు స్వీక‌రిస్తార‌న్నారు. నందిగామ‌కు సంబంధించి నందిగామ ఆర్‌డీవో కార్యాల‌యంలో నామినేష‌న్లు స్వీక‌రిస్తార‌న్నారు. జ‌గ్గ‌య్య‌పేట‌కు పౌర స‌ర‌ఫ‌రాల డీఎం ఆర్‌వోగా ఉన్నార‌ని.. నామినేష‌న్ల‌ను అక్క‌డి త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో స్వీక‌రిస్తార‌ని క‌లెక్ట‌ర్ వివ‌రించారు.

రాజ‌కీయ పార్టీల‌కు అవ‌గాహ‌న..

నామినేష‌న్ల ప్ర‌క్రియ‌పై రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌కు పూర్తిస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించిన‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. నామినేష‌న్ల స‌మ‌ర్ప‌ణ‌లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌తో పాటు లోక్‌స‌భ స్థానానికి సంబంధించిన ఫారం 2ఏ నామినేష‌న్ పేప‌ర్, శాస‌న‌స‌భ స్థానానికి సంబంధించిన ఫారం 2బీ నామినేష‌న్ పేప‌ర్‌లోని ప్ర‌తి భాగం గురించి క్షుణ్నంగా వివ‌రించిన‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వ సెల‌వు దినాల్లో మిన‌హా మిగిలిన అన్ని రోజుల్లో ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. అభ్య‌ర్థితో కలుపుకొని గ‌రిష్టంగా మొత్తం అయిదుగురికి మాత్ర‌మే ఆర్‌వో ఛాంబ‌ర్‌లోకి అనుమ‌తి ఉంటుంద‌న్నారు.

వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు..

నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా మూడు వాహనాల‌ను అనుమతించడం జరుగుతుందన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అవగాహన కల్పించేందుకు పార్లమెంటు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. ఆర్‌వో కార్యాల‌యం బ‌య‌ట‌, లోప‌ల కూడా సీసీటీవీలు ఏర్పాటు చేశామ‌ని.. వీడియోగ్ర‌ఫీ చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఒక అభ్య‌ర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గానికి పోటీచేసే అభ్య‌ర్థి రూ. 25 వేలు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి పోటీచేసే అభ్య‌ర్థి రూ. 10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంద‌ని.. అభ్య‌ర్థులు ఎస్‌సీ, ఎస్‌టీల‌కు చెందిన వారైతే 50 శాతం మేర మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే స‌రిపోతుంద‌న్నారు. అభ్య‌ర్థుల ఓటు ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉంటే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఈఆర్‌వోల నుంచి తీసుకున్న స‌ర్టిఫైడ్ ఎక్స్‌ట్రాక్ట్ కాపీని స‌మ‌ర్పించాల్సి ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు.

26న‌ నామినేష‌న్ల స్క్రుటినీ..

ఈ నెల 26వ తేదీన నామినేష‌న్ల స్క్రుటినీ ఉంటుంద‌ని.. అదే విధంగా 29వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్లను ఉప‌సంహ‌రించుకునేందుకు వీలుంటుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. అనంత‌రం సింబ‌ల్ అలాట్‌మెంట్ జ‌రుగుతుంద‌ని.. పోటీలో నిలిచిన అభ్య‌ర్థుల‌ను ఫారం-7ఏ ద్వారా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ఈ మొత్తం ప్ర‌క్రియ‌లో ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌క్కుండా ఉండేందుకు ఆర్‌వోలకు ఇప్ప‌టికే మూడు రౌండ్ల శిక్ష‌ణ ఇవ్వ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. అభ్యర్థి ఎన్నికల వ్యయ పరిశీలన కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పుటి నుంచి, ఎన్నికల ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement