Saturday, November 23, 2024

ఎన్నిక‌ల హీట్ – జ‌నంలో బాట‌లో పార్టీలు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి. దానికి తగ్గట్టుగానే రాజకీయ వేడి కూడా మంట పుట్టిస్తోంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రజలనే ఎజెండాగా చేసుకుని వారి మధ్యకు వెళ్తున్నాయి. తాము మంచి చేసామని భావిస్తేనే ఓటేయండంటూ వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ప్రజలను సూటిగా అడుగుతున్నారు. అసలేం చేశారని మీకు ఓటేయాలంటూ విపక్ష నేత చంద్రబాబు కౌంటర్‌ అటాక్‌లు ఇస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ఫోటోలతో ట్వీట్ల వార్‌ కొనసాగిస్తు న్నారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకుని అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి జిల్లాలకు ఒక ఐఏఎస్‌ అధికారిని సీఎం జగన్‌ నియమించారు. ఈక్రమం లోనే జగనన్నే మా భవిష్యత్‌ అంటూ అధికార వైకాపా ప్రజల మధ్యకు వెళ్తుండగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ తెలుగుదేశం నేతలు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ఇక జనసేన, బీజేపీ కూడా ఇదే తరహా రాజకీయా లను ఫాలో అవుతున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా అడపా దడపా కార్యక్రమాలను రూపొందిం చుకుని ప్రజల మధ్యకు వెళ్తు న్నాయి. ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్రం తీసుకు న్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ ఎజెండ లో వచ్చి చేరింది. దీనిపై అన్ని రాజకీ య పక్షాలు తమవంతు పాత్ర పోషించేం దుకు నానా తంటాలు పడుతున్నాయి. ఈక్రమంలోనే కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ అంశంలో వేస్తున్న పిల్లి మొగ్గలకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బొక్క బోర్లా పడుతున్నాయి. వీట న్నింటి నడుమ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పతాక స్థాయికి చేరుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

నవరత్నాల అమలుకు ఐఏఎస్‌ అధికారులు
ఇదిలా ఉండగా ‘మీకు మంచి జరిగిందంటేనే జగన్‌కు ఓటేయండి’ అంటూ వైసీపీ అధినేత, సీఎం జగన్‌ బహిరంగ సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ వస్తున్న ఆయన వాటిని మరింతగా ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. అందుకోసం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించి నవరత్నాల అమలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలోనే గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నే మ భవిష్యత్‌ అంటూ తన టీంను నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో మమేకయ్యేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రజల నుండి ఈ కార్య క్రమాల ద్వారా వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌తో మరింత సమర్ధవంతంగా నవరత్నాలు ప్రజలకు అందించే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఇక సంక్షేమ పథకాల అమలులో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తు న్న ఆయన విపక్షాలపై పదునైన మాటల తూటాలు విసురుతున్నారు. ఘాటైన విమర్శలతో కేడర్‌కు ఉత్తేజాన్ని నింపుతూ ప్రజలకు గత ప్రభుత్వంలో ఏం జరిగింది..ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతోందన్న అంశాన్ని వివరించేందుకు ఉత్తేజపరుస్తున్నారు. దీంతో కేడర్‌ మొత్తం ప్రజల్లోనే తిరుగుతూ పాలనలో నాడు-నేడు అంటూ వివరిస్తున్నారు.

సింగిల్‌గానే రాష్ట్రాన్ని చుట్టేస్తున్న చంద్రబాబు
ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా తన రాకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. గడచిన మూడున్నరేళ్లుగా నిస్తేజంగా ఉన్న పార్టీ కేడర్‌కు జవసత్వాలు కల్పిస్తున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ కేడర్‌ను ప్రజల్లోకి పంపుతున్నారు. అంతటితో ఆగకుండా ఆయనే మండుటెండను కూడా లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే పార్లమెంటరీ నియోజవర్గాల వారీగా సమీక్షలు పూర్తిచేసుకున్న ఆయన ఆ పార్లమెంటు పరిధిలో బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసకుని స్వయంగా పర్యటిస్తున్నారు. ఆయా పర్యటనల్లో కేడర్‌కు నూతనోత్తేజాన్ని అందిస్తూనే అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తన పర్యటనలో భాగంగా ఒక్కో అంశాన్ని తీసుకుని సెల్ఫీలతో సీఎం జగన్‌కు సవాళ్లు విసురుతున్నారు. మరో వైపు యువ నేత లోకేష్‌ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. తండ్రీ తనయులిద్దరూ ప్రజల్లోనే ఉంటూ పార్టీ నేతలను కూడా ప్రజల మధ్యే ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

అదే బాటలో జనసేన.. బీజేపీ
ఇక రాష్ట్రంలో ఉన్న మరో రెండు పార్టీలైన జనసేన, భారతీయ జనతాపార్టీలు కూడా ప్రజల మధ్యకు వెళ్తున్నాయి. ఇప్పటికే బీసీ సదస్సు, పార్టీ ఆవిర్భావ సదస్సు నిర్వహించిన జనసేనాని పవన్‌ కల్యాన్‌ ఇకపై ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్న జనసేనాని దానిపై తనదైన శైలిలో స్పందిస్తూ అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక ఇసుక, మట్టి అక్రమ రవాణాపై కూడా ఆయన ప్రత్యేకంగా పోరాడుతున్నారు. ఇదే బాటలో బీజేపీ కూడా పయనిస్తోంది. ఇప్పటికే ఇసుక, మట్టి అక్రమ రవాణాపై పర్యటించిన ఆపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరిన్ని కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. నిత్యం ప్రజల మధ్యే ఉండేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

- Advertisement -

కేంద్రం పిల్లిమొగ్గలకు.. చిత్తవుతున్న పార్టీలు
ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు రాజకీయ ఎజెండాలో వచ్చి చేరింది. దీనిని ఎవరికి వారే తమ వంతు ఖాతాలో వేసుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఈక్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ అంశంలో పిల్లిమొగ్గలేస్తోంది. ఈ పిల్లిమొగ్గలకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ బొక్క బోర్లా పడుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటున్న తరుణంలోనే కేంద్రం ప్రైవేటీకరణ అంశానికి పదునుపెట్టి దీనిని ఎన్నికల అంశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లే ప్రయత్నాలు ఆపేస్తున్నామంటూ ప్రకటన చేసి గంటల వ్యవధిలోనే దానిపై తూచ్‌ అంది. అంతటితో ఆగకుండా మరుసటి రోజే ప్రైవేటీకరణ ఆగదని స్పష్టంచేస్తూ ప్రకటన చేసింది. ఆమరుసటి రోజు బిడ్లలో పాల్గొనేందుకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయ పార్టీలన్నీ అసలు ఏం జరుగుతుందో తెలయక కంటి చూపు..నోటి మాట లేకుండా పోయినట్లయింది. నిన్నమొన్నటి వరకూ తమ ప్రయత్నం వల్లే ఆగిందని డాంబీకాలు పలికిన పార్టీలన్నీ ఇప్పుడు కిమ్మనకుండా ఏం జరుగుతుందో వేచి చూసే దోరణికి దిగాయి. వీటన్నింటి నడుమ రాష్ట్రం లో ప్రజలను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఎవరి దారిలో వారు ప్రయాణం మొదలు పెట్టి ముందకు సాగుతున్నాయి. ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement