అమరావతి, ఆంధ్రప్రభ: ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విద్యా విధానంలో పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాల్లోని విషయాలను గమనిస్తే ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు తరగతికి చెందిన సామర్య్ధాలు సాధించడానికి బడి సమయం చాలు. ఇంటి వద్ద చదవడం, ట్యూషన్లలో చేర్పించనవసరం లేదు. కాని విద్యార్ధులలో మాత్రం సామర్ధ్యాలు మెరుగు పడకపోవడానికి గల మూల కారణాలను, లోటుపాట్లను అధికారులు గుర్తించారు.
తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించి సిలబస్ పూర్తిచేయడంతో తమ బాధ్యత పూర్తయిందని బావిస్తున్నారే గానీ విద్యార్ధులకు అవగతం అవుతుందా అనే విషయాన్ని పట్టించుకోకపోవడం వల్ల విద్యార్ధులలో అభ్యసనా సామర్య్ధాలు కొరవడి మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్నారని అధికారులు భావించారు. ఈ నేపధ్యంలో విద్యార్ధులు విద్యపై స్వయం ప్రేరణ కలిగేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకునేలా ప్రతి ఉపాధ్యాయుడు పనిచేయాలని అధికారులు నిర్ణయించారు.
ముఖ్యంగా కనీస భాష, గణిత సామర్ధ్యాలు లేని విద్యార్ధులకు పాఠశాల ఆరంభ సమయంలో రెండు మూడు నెలలు కృషి చేసి తగిన బోధనా పద్ధతులు, వనరులను ఎంచుకుని పిల్లలు కనీస సామర్ధ్యాలు సాధించేలా చూడాలని, ఆ తరువాతనే పాఠ్యాంశాల బోధన ప్రారంభించాలని నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా విద్యార్థి అభ్యసనంలో, తరగతి గదిలో జరిగే చర్చలలో పాల్గొనడం ద్వారా స్వయంగా చదువుకుంటారని గుర్తించారు.
దీనివల్ల తాను నేర్చుకుంటున్నాననే భావన కలిగి ఆనంద పడి మరింత కృషిచేయడానికి చదవడం, రాయడం వంటివి అలవాటుగా మారి ఆలోచనపరునిగా, స్వయం ప్రేరణతో పిల్లలను ముందుకు సాగుతారని అధికారులు ఆలోచన జరిపారు. అందుకనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దేలా కార్యచరణ రూపొందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 8వ తరగతి చదివే విద్యార్ధుల అభ్యసనా సామర్ధ్యాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపరచేలా తీర్చిదిద్దడానికి పాఠశాల ఆరంభం నుండే ఉపాధ్యాయులు అవలంబించవలసిన విధానాలు, పాటించవలసిన పద్ధతులు తదితర అంశాలపై లెర్నింగ్ ఇంప్రూమోంట్ ప్రోగ్రామ్ (ఎల్‌ఐపి) సమగ్ర శిక్ష అధికారులు రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. వచ్చే యేడాది పిభ్రవరి నాటికి విద్యార్ధులదరూ అభ్యసనా సామర్ధ్యాలు సాధించేలా కార్యాచరణ చేపట్టారు.
రాష్ట్రస్ధాయి బృందాల పరిశీలనలో…
రాష్ట్రస్ధాయి బృందాలు పాఠశాలలను పరిశీలించినపుడు అనేక విషయాలు తేటతెల్లమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. విద్యార్ధులలో చురుకైన భాగస్వాయ్యం లేకుండా పాఠ్యాంశం చదివి అర్థం వివరించడం వంటి నాణ్యతలేని తరగతి గది బోధనను పరిశీలించారు. అభ్యసన లోటుకు ప్రధాన కారణం నాణ్యత లేని లోపభూయిష్టమైన బోధనా విధానాలు అనుసరించడంగా గుర్తించారు. విద్యార్ధులు చదవడంపై దృష్టి పెట్టడం, చదవడాన్ని అభివృద్ధిపరిచే ప్రత్యేక వ్యూహాల నిర్వహణ తరగతి గదులలో లోపించిందని రాష్ట్రస్థాయి బృందం తెలిపారు.
బోధనా సమయంలో కొద్ది మంది విద్యార్ధులు మాత్రమే ప్రశ్నలకు స్పందిస్తున్నారని, ఎక్కువ మంది విద్యార్ధులు మౌనంగా ఉంటున్నారని గుర్తించారు. ప్రధానోపాధ్యాయులు ఎవరూ పాఠ్య ప్రణాళిక పరిశీలించలేదని, నాణ్యతపర అంశాల పట్ల వారు సూచనలు రాయలేదని, ఇవ్వలేదని తెలిపారు. కెజిబివి పాఠశాలలు, మోడల్స్ స్కూల్స్‌లో 30 శాతం విద్యార్ధుల గైర్హాజరును గుర్తించారు. విద్యార్ధులు ఎందుకు రావడం లేదు వంటి విషయాలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విశ్లేషణ చేయడంలేదని బృంద సభ్యులు పేర్కొన్నారు.
విద్యార్ధులు ఆంగ్లంలో చదవడం విషయంలో బాగా వెనుకబడి ఉన్నారని కాని ఉపాధ్యాయులు మాత్రం ఈ సార్ధ్యాలను పెంపొందించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా సిలబస్‌ని పూర్తి చేయడంపై దృష్టి పెడుతున్నారని వారి పర్యటనలో గుర్తించారు. సిలబస్ పూర్తి చేయడమంటే అభ్యసన ఫలితాలను సాధించడమని అందరూ ఉపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.
ప్రతి పాఠశాలలో గ్రంథాలయాలు, గ్రంథాలయ పుస్తకాలు ఉన్నాయని కాని ఎకువ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్ధులు వీటిని ఉపయోగించడంలేదని గుర్తించారు. ఇలా రాష్ట్రస్థాయి బృంద పరిశీలనలో వెల్లడైన అనేక లోపాలను ప్రక్షాళన చేయడానికి అభ్యసన మెరుగుదలకు అమలు పరచాల్సిన వ్యూహాలపై అధికారులకు లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాటిస్తున్న లోపాలు, అనుసరించవలసిన వ్యూహాలు, పలు సూచనలు, సలహాలతో ‘టీచర్స్ హ్యాండ్ బుక్’ పేరిట పుస్తకాన్ని ముద్రించి అందజేశారు.
10 జిల్లాల్లో శిక్షణ:
విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం, మన్యం, వైఎస్‌ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో శిక్షణ నిర్వహించాలని అదికారులు ప్రతిపాధించారు. ఈ మేరకు ఈ నెల 4వ తేదీన విజయవాడలో సమగ్ర శిక్ష, సిప్స్, సేవ్ ది చిల్డ్రన్, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు- రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్‌ఐపి శిక్షణకు సంబంధించి కార్యాచరణ, ప్రణాళికతో రూపొందించిన కరదీపికను సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు శిక్షణ పొందే వారికి అందజేశారు. రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమంలో శిక్షణ పొందిన డిఆర్‌పిలు అందరితో జిల్లా స్థాయిలో ప్రణాళికా సమావేశం, శిక్షణ ప్రణాళిక మరియు శిక్షణా సామగ్రి, పిీపీటిల శిక్షణా మందిరాలు, ఐఎఫ్‌పి ప్యానెల్, ఇతర బోధనా అభ్యాస వనరులను సిద్ధం చేయాల్సి ఉంది.
జిల్లా స్థాయిలో…
ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, కాంపెక్స్ లెవల్ సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్స్, జిల్లా స్థాయిలో ఉన్న ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు ఎల్‌ఐపి శిక్షణలో తప్పనిసరిగా పాల్గొనాలని సమగ్ర శిక్షా డైరెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. అధికారులు ఎంపిక చేసిన 10 జిల్లాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల ఆరు నుండి 16వ తేదీ వరకు ఎల్‌ఐపి శిక్షణ ఇవ్వనున్నారు. రెండు విభాగాలలో శిక్షణ ఉంటుంది. ఒకో విభాగంలో రెండు స్పెల్‌లు నిర్వహిస్తారు. ఒక్కో స్పెల్‌కు రెండు రోజుల శిక్షణ ఉంటుంది.
మొదటి విభాగంలో..
జిల్లా స్థాయిలో కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్‌లకు శిక్షణ ప్రతి సబ్జెక్ట్ కాంప్లెక్స్‌కు 2 చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు.
స్పెల్ 1 కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్‌లకు శిక్షణ 6 నుంచి 7 వరకు, స్పెల్ 2 8 నుంచి 9 వరకు
రెండవ విభాగంలో….
ఎల్‌ఐపి వ్యూహాలపై ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్‌ఎమ్‌లు, ఎంఈవోలకు శిక్షణ ఇవ్వనున్నారు.
స్పెల్ 1 హెచ్‌ఎమ్‌లు, ఎంఈవోలలకు 13 నుంచి 14వరకు, స్పెల్ 2 15 నుండి 16 వరకు శిక్షణ ఉంటుంది. రెండు స్పెల్‌లు 40 చొప్పున హెచ్‌ఎమ్‌లు, ఎంఈవోలు చొప్పున 4 బ్యాచ్‌లతో ఉంటాయి.
సబ్జెక్ట్ కాంప్లెక్స్ స్థాయిలో…
16వ తేదీతో జిల్లా స్థాయిలో శిక్షణ ముగిసిన అనంతరం ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుంది. సబ్జెక్ట్ స్కూల్ అసిస్టెంట్లు-, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్‌లో తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్ మరియు సోషల్ స్టడీస్ సబ్జెక్టులలో పనిచేస్తున్న భాషా పండిట్‌లకు 27 నుంచి 28వ తేదీ వరకు, కాంప్లెక్స్ స్థాయి నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు 29 నుండి 30 వరకు శిక్షణ ఉంటుంది.
శిక్షణలో ఉండే అంశాలు:
- ఆంగ్ల మాధ్యమ బోధనా, వ్యూహాలు
- పిలబస్ పూర్తి చేయడం – అభ్యసన ఫలితాలు సాధించడం
- తరగతి బోధనను మెరుగుపరచడం – నాణ్యమైన బోధనకు సూచికలు
- పాఠశాలల అకడమిక్ మానిటరింగ్, ఉపాధ్యాయులకు సహకారం
- పాఠశాల గ్రంథాలయాలు, చదవడం యొక్క ప్రాాముఖ్యత – పాఠశాల గ్రంథాలయాల పాత్ర
- ఉపాధ్యాయ సంసిద్ధత – పాఠ్య ప్రణాళికల ప్రాధాన్యత, ప్రభావం
- విద్యార్ధుల ప్రగతి నమోదు – ప్రారంభ పరీక్ష, ద్విమాసవారి ప్రగతి నమోదు
- స్కూల్ కాంప్లెక్సులు లక్ష్యాత్మకంగా పనిచేయడం, సమావేశాలు, ఎజెండా
- నాణ్యమైన తరగతి బోధన – సబ్జెకుట వారీగా వీడియోలు రూపొందించడం