Sunday, November 3, 2024

AP – ఈపూరుపాలెం హత్యాచారం కేసు – ముగ్గురు అరెస్ట్

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం యువతి అత్యాచారం, హత్య కేసును 48 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులు దేవరకొండ విజయ్, కారంకి మహేష్, దేవరకొండ శ్రీకాంత్‌లుగా గుర్తించారు. నిన్న(శుక్రవారం) బహిర్భూమికి వెళ్ళిన యువతిపై యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. గంజాయి మత్తులో అఘాయిత్యానికి ఒడిగట్టిన ఇద్దరు యువకులు, వారికి సహకరించిన మరో యువకుడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యువతిని అత్యాచారం చేసిన అనంతరం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. కేసును స్వయంగా బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షించారు. యువకులు అదే గ్రామానికి చెందిన రౌడీషీటర్లు కాగా.. పోలీసుల విచారణలో హత్యను ఆ యువకులు ఒప్పుకున్నారు. వివరాలను బాపట్ల ఎస్పీ మీడియాకు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే..

- Advertisement -

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన సుచరిత(21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కూతురు ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో వెతుకుతూ వెళ్లిన తల్లికి స్థానిక గర్ల్స్ హైస్కూల్ సమీపంలో కుమార్తె సుచరిత మృతదేహం కనిపించింది. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చంద్రబాబు సీరియస్‌

అనంతరం సుచరిత హత్య గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటన ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని, ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలని హోంమంత్రికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి వారికి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. దర్యాప్తులో అలసత్వం లేకుండా.. జాప్యం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

ఈపూరుపాలెంకు హోంమంత్రి

సీఎం ఆదేశాలతో హత్య జరిగిన ఈపూరుపాలెంకు హోంమంత్రి అనిత వెళ్లారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. స్థానిక ఎమ్మెల్యే ఆ కుటుంబానికి అందజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో విచారణ చేపట్టిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement