ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు సెలవులు పొడిగింపు విషయంలో విద్యాశాఖ పునరాలోచనలో పడింది. పబ్లిక్ ఒపీనియన్ ఆధారంగా విద్యా శాఖ మంత్రి నేడు ప్రెస్ మీట్ ద్వారా నిర్ణయం ప్రకటించనున్నారు. ఈనెల 30 వరకు సెలవులు పొడిగింపు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నేడు పాఠశాల ముగింపు సమయం లోపల అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
మరోవైపు రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగించే ఆలోచన ఏదీ లేదని నిన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు.15-18 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థుల్లో దాదాపు 92% మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలను యథావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రతపై డేగకన్నుతో నిఘా ఉంచిందన్నారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే పాఠశాలలు నడిపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు.
అయితే, రాష్ట్రంలో క్రమంగా కోవిడ్ కేసులు పెరగడం, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు పొడిగింపుపై ప్రభుత్వం పునరాలోచనలోపడిందని సమాచారం. మరోవైపు తెలంగాణలో విద్యాసంస్థలను ఈ నెల 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో వైద్యకళాశాలలు మినహా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున సెలవులు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.