న్యూఢిల్లీ – సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలను సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు. ఈనెల మొదటి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తప్పుడు హామీలిస్తే వేటే..
ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీలకు, నేతలకు ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ప్రచారంలో భాగంగా తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేయొద్దని సూచించింది. అంతేకాకుండా సామాజిక వర్గం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగొద్దని, వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని కోరింది. ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ముఖ్యంగా గతంలో నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చింది.
ప్రార్ధన మందిరాలలో ప్రచారం నిషేధం ..
అలాగే ప్రార్థనా మందిరాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారానికి వాడుకోవద్దని ఈసీ స్పష్టం చేసింది. ప్రచారంలో మర్యాదపూర్వకంగా, నైతిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. సమస్యలే ప్రధానాంశాలుగా ఎన్నికల్లో ముందుకెళ్లాలని తెలిపింది. సోషల్ మీడియాలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది. ప్రత్యర్థులను దూషించే, కించపరిచే పోస్టులకు దూరంగా ఉండాలని పేర్కొంది.
ప్రసంగాలలోకి మహిళలను లాగొద్దు..
మహిళలపై అనుచిత వ్యాఖ్యాలు చేయరాదని, రాజకీయ నేతల కుటంబాలలోని మహిళలు, పిల్లలను ప్రసంగాలలో ప్రస్తావించరాదని తేల్చిచెప్పింది. తాము చేసిన పనులు, చేయబోయే పనులు మాత్రమే ప్రస్తావించాలని సూచించింది.. అన్ పార్లమెంటరీ పదాలతో పాటు అశ్లీల, అసభ్య పదజాలం ఉపయోగిస్తే వేటు వేస్తామని పేర్కొంది.
చిన్నారులతో ప్రచారం చేస్తే చర్యలు కఠినం..
ఇక ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. బాల కార్మిక చట్టాలు, నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూసుకునే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేసింది. ఎన్నికల సందర్భంగా నేతలు ఇచ్చే హామీల అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని, అదే విధంగా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చే హక్కు పార్టీలకూ ఉంటుందని పేర్కొంది.
ఈసీ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే
కుల, మతతత్వ ప్రాతిపదికన ఓటర్ల మధ్య విభేదాలు పెంచి పరస్పర విద్వేషాలు సృష్టించే చర్చలు ఉండకూడదు.
కులం, వర్గం, భాష, మతం ప్రాతిపదికన ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేయరాదు. దేవుడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు.
ఓటర్లను తప్పుదోవ పట్టించేలా మాట్లాడకూడదు. తప్పుడు ప్రకటనలు మానుకోవాలి.
ప్రజా కార్యకలాపాలకు సంబంధం లేని ఏ పార్టీ నాయకుడి లేదా కార్యకర్త వ్యక్తిగత జీవితంలోని ఏ అంశాన్ని విమర్శించకూడదు. ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడులు లేదా అవమానాలకు దూరంగా ఉండాలి.
దేవాలయాలు, మసీదులు , గురుద్వారాలు లేదా ఏ ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించకూడదు.
ప్రచార సమయంలో మహిళల గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడకూడదు.
తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయరాదు. వంటి తదితర హెచ్చరికలు సూచించింది.