అభ్యంతరాలకు ఈనెల 26వరకు అవకాశం
ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ
త్వరలోనే ఫలితాలు..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2024 ఎంట్రన్స్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 93.47శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్, బైపీసీ విభాగం పరీక్షలకు కలిపి మొత్తం 3,62,851మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,39,139 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌కు స్ట్రీమ్‌కు సంబంధించి 2,74,213 మందికి గాను 2,58,373 అంటే 94.22 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. బైపీసీ స్ట్రీమ్‌కు 88,638 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేయగా.. వారిలో 80,766 అంటే 91.12 శాతం మంది పరీక్షలు రాశారు.
ఇక నేడు బైపీసీ విభాగం పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్ షీట్లను వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచారు. ప్రైమరీ ‘కీ’ పై ఈనెల 25 ఉదయం 10 గంటలలోపు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను లేవనెత్తేందుకు అవకాశం కల్పించారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రైమరీ ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు. ఇంజినీరింగ్ ఆన్సర్ ‘కీ’ పై మే 26 ఉదయం 10 గంటలలోపు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు.
ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇందుకు గానూ ఇతర విద్యార్థులు తమ మార్కులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇతర సందేహాలు, వివరణలకు 0884-2359599, 2342499 నంబర్ల ద్వారా ఫోన్‌లో సంప్రదించాలని ఈఏపీసెట్ కన్వీనర్ సూచించారు. కాగా ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు బైపీసీ విద్యార్థులకు 16, 17తేదీల్లో నాలుగు విడతలుగా జరుగగా ఎంపీసీ వారికి 18 నుంచి 23 వరకు తొమ్మిది విడతల్లో నిర్వహించారు. త్వరలో తుది ఆన్సర్ కీ తో పాటు ఫలితాలను కూడా విడుదలవుతాయి.