అనంతపురం – ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి నిర్వాకం కలకలం సృష్టిస్తోంది.. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే.. ఏకంగా మూత్రనాళం తొలగించాడు వైద్యుడు.. అయితే, మూత్రం రాకపోవడంతో ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి చేరిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే.. కూడేరు మండలం హంసాయపల్లికి చెందిన రాధమ్మ అనే మహిళ అనారోగ్యంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చింది.. గర్భసంచిలో సమస్య ఉందని… తన ప్రైవేటు ఆసుపత్రికి వస్తే ఆపరేషన్ చేస్తానని సూచించాడు ప్రభుత్వ డాక్టర్ రమణ నాయక్..
దీంతో.. ఈ నెల 9వ తేదీన రమణ నాయక్ కు చెందిన లావణ్య ఆసుపత్రిలో రాధమ్మకు ఆపరేషన్ చేశారు.. అదేరోజు డిశ్చార్జ్ కూడా చేశారు.. అయితే, డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు రోజులకు కూడా మూత్రం రాకపోవడంతో తిరిగి రమణ నాయక్ ఆసుపత్రికి వచ్చింది బాధితురాలు రాధమ్మ .. తప్పు జరిగిందని తెలుసుకుని.. అసలు విషయం చెప్పకుండా.. బాధితురాలు రాధమ్మను వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించిన వైద్యుడు.. వేరే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాక.. రెండు రోజులుగా మూత్రం రాక.. కిడ్నీ వాపుతో బాధపడుతున్న రాధమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిసింది..
గర్భసంచి ఆపరేషన్ కు బదులు.. మూత్ర నాళం తొలగించారన్న విషయం బయటపడింది.. దీంతో బాధితురాలి బంధువులు లావణ్య హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు.. నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ రమణ నాయక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..