అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో పనిచేసిన కాలంలో తన పనితనానికి గాను పీపుల్స్ కలెక్టర్ గా పేరొందిన బాలయ్య నాయుడు లక్ష్మీకాంతంకు శుక్రవారం దివిలో సత్కారం జరగనుంది. దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు “స్మారక” అవార్డును ఆయన ఈరోజు అందుకోనున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని గాంధీ క్షేత్రంలో శుక్రవారం జరిగే మండలి వెంకటకృష్ణారావు జయంతి సందర్భంగా ఈ స్మారక అవార్డును ప్రధానం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఫార్మర్ కలెక్టర్ లక్ష్మీకాంతంకు దివిసీమ స్వాగతం పలుకుతోంది. 2017- 2019 మధ్యకాలంలో రెండేళ్ల పాటు కృష్ణాజిల్లా కలెక్టర్ గా పని చేసిన బి.లక్ష్మీకాంతం తన పరిపాలనలో అనేక కొత్త పోకడలు తీసుకొచ్చారు. ప్రజల్లో హ్యాపీనెస్… జవాబుదారి తనం …ప్రతిస్పందన విషయంలో ఆయనకు ఆయనే సాటి అనిపించారు. గ్రీవెన్స్, పిటిషన్ ఆడిట్ తదితర అంశాల్లో అనేక అవార్డులు ఆయన అందుకున్నారు. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోపాన్ని నివారించి వారిలో పోషక విలువులను పెంపొందించి తద్వారా “పోషకాభియాన్ “అవార్డు అందుకున్నారు. ఇలాంటి అవార్డులు ఎన్నో ఆయన తన బాల్యం నుంచి అందుకుంటూ వచ్చారు.
150 అవార్డులందుకున్న లక్మీకాంతం….
విద్యాభ్యాసం నుంచి కలెక్టర్ వరకు దాదాపు 150 అవార్డులు అందుకున్న ఘనత లక్ష్మీ కాంతంకు దక్కింది. వీటిలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అనేకం ఉన్నాయి .ఈ -గవర్నెన్స్ అమలులో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ అవార్డు పొందారు. అంతర్జాతీయ స్థాయిలో 17 పర్యాయాలు ఐఎస్ఓ అవార్డులు ఆయనకు వచ్చాయి. కృష్ణాజిల్లా కలెక్టర్ గా పనిచేసిన కాలంలో ఒక్కరోజులో 23 వేల మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి గిన్నిస్ బుక్ లో వరల్డ్ రికార్డు సాధించారు. అలాగే అరగంట అభివృద్ధిలో 4.66 లక్షల అడుగుల ఇండియా మ్యాప్ తో రంగోలి నిర్వహించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ఇవి కాకుండా రెడ్ క్రాస్ ద్వారా గోల్డ్ కప్, గోల్డ్ మెడల్స్ అవార్డులు ఆయనకు దక్కాయి. అలాగే ఎలక్షన్ కమిషన్ అమలు చేసిన ఓటర్లకు అవగాహన కార్యక్రమాల్లో ఈయనకు రెండు పర్యాయాలు ప్రత్యేక అవార్డులు లభించాయి. పదవి విరమణ అనంతరం సైతం ఈయనను అవార్డులు వెంటాడుతూనే ఉన్నాయి. లైఫ్ టైం అచీవ్మెంట్ ….విశ్వ గురు …అవార్డు తదితర అవార్డులు ఆ కోపలో ఉన్నాయి.
విద్యాభ్యాసం అంతా చిత్తూరు లోనే…
లక్ష్మీకాంతం విద్యాభ్యాసం అంతా చిత్తూరులోనే కొనసాగింది .ఆయన జన్మస్థలం అక్కడే .బాలయ్య నాయుడు -సుభద్రమ్మ ఈయన తల్లిదండ్రులు. భార్య శోభాలత. ఈయనకు ఇరువురు సంతానం. కుమార్తె హాసంతిక డాక్టర్ గా పనిచేస్తుండగా, అల్లుడు వీర రాఘవ రావు 2007 ఐఏఎస్ బ్యాచ్ కి చెందినవారు. ఈయన ప్రస్తుతం తమిళనాడు గవర్నమెంట్ లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. కుమారుడు భవదీప్ సివిల్ కు ప్రిపేర్ అవుతున్నారు. జాయింట్ కలెక్టర్ గా ఉమ్మడి రాష్ట్రంలో నెల్లూరు, అదిలాబాద్, అనంతపురం జిల్లాలో పనిచేసిన లక్ష్మీకాంతం రాష్ట్ర విభజన తర్వాత కృష్ణాజిల్లాలో కలెక్టర్ గా పని చేశారు. తదనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో జేఈవో గా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు .పదవీ విరమణ అనంతరం ఈయన అనేక పదవులను అలంకరిస్తూ వున్నారు. ప్రస్తుతం వాణిజ్య ఒప్పందాలపై భారత్ – యూరోపియన్ కు సంబంధించి 15మంది ప్యానెల్ లో ఈయన ఒకరుగా ఉన్నారు. ఫార్మా, వస్త్ర, వ్యవసాయ రంగాలపై ఈ ప్యానెల్ అధ్యయనం చేస్తుంది. ఇటీవల దీనిపై యురోపియన్ పార్లమెంట్లో జరిగిన సదస్సులో లక్ష్మీకాంతం పాల్గొన్నారు. అలాగే బెంగళూరులో గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ ఆఫ్ స్టాటఫ్ డైరెక్టర్ గా ఈయన కొనసాగుతున్నారు. హైదరాబాదులో గల సి ఎస్ బి ఐఏఎస్ అకాడమీకి చీఫ్ అడ్వైజర్ గా లక్ష్మీకాంతం ఉన్నారు . వీటితో పాటు వేదాద్రి సమీపంలో గల సురేంద్రపురి మ్యూజియం ద్వారా జరిగే మూడు వేల దేవాలయాల సముదాయానికి సంబంధించి ఎల్ ఆర్ ఎఫ్ టెక్నాలజీకి తానే చీప్ అడ్వైజర్. అంతేకాకుండా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ మిషన్ కు జాతీయస్థాయి సలహాదారుగా ఈయన పని చేస్తున్నారు.
మండలి వ్యక్తి కాదు శక్తి…. లక్ష్మీకాంతం
మండలి వెంకటకృష్ణారావు వ్యక్తి కాదు శక్తి అని కృష్ణాజిల్లా మాజీ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం పేర్కొన్నారు. ఆయన పేరుమీద స్మారక అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాదులో నిర్వహించిన ఘనత మండలి వెంకట కృష్ణారావుకు దక్కిందన్నారు .ఈ మహాసభల నిర్వహణ ద్వారా తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలిశాయన్నారు. 1977లో దివిసీమను అతలాకుతలం చేసిన ఫెను తుఫాను నుంచి ప్రజలను సాధారణ పరిస్థితిలకు తీసుకురావడంలో మండలి చేసిన కృషి అమోఘమన్నారు. ఆ సేవలకు గాను ఆయన ఓదార్పు ఘనుడుగా పేరు పొందారన్నారు. తెలుగు వెలుగు …దివిసీమ గాంధీ… సూత్ర దారి…గా కిర్తించబడిన మండలి తెలుగు జాతి గర్వపడే వ్యక్తి గా గుర్తింపు పొందారన్నారు. ఎంతో నిరాడంబర జీవితం గడిపిన మండలి వెంకట కృష్ణారావు నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శనీయులన్నారు. అవనిగడ్డలో గాంధీ క్షేత్రాన్ని నెలకొల్పి దివిసీమ గాంధీగా పేరొందిన మండలి రాజకీయాల్లో సైతం తనదైన శైలిలో వ్యవహరించారన్నారు. విద్య, సాంస్కృతిక, సహకార శాఖ మంత్రిగా ఆయన సేవలు గణనీయమన్నారు.
ఆయన భావాలను, ఆశయాలను పుణికి పుచ్చుకున్న మండలి బుద్ధ ప్రసాద్ తెలుగు భాషాభిమానిగా ప్రజల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారన్నారు. తద్వారా తండ్రికి తగ్గ తనయుడిగా బుద్ధ ప్రసాద్ పేరుగాంచారన్నారు .ఆయన వ్యవస్థలో మార్పులు …సంస్కరణలు కోరుకునే వ్యక్తి అన్నారు. తన తండ్రి పేరు మీద 2007 నుంచి ఈ స్మారక అవార్డులు అందిస్తున్న మండలి బుద్ధ ప్రసాద్ ఈ ఏడాది ఆ అవార్డును తనకు ప్రధానం చేయడం హర్షణీయమన్నారు.