కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు నేడు సీఎం చంద్రబాబును కలిశారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో యువతి హత్యకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని సీఎం డీజీపీతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని సీఎం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాలని నిర్దేశించారు.
మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కాగా, ఇప్పటికే పోలీస్ శాఖలో ప్రభుత్వం ప్రక్షాళన మొదలుపెట్టింది. కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. మరిన్ని బదిలీలు జరగొచ్చని సమాచారం. అటు, కీలక శాఖల్లో పలువురు ఐఏఎస్‌లు సైతం బదిలీ అయ్యారు.