అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆయన పదవీ కాలాన్ని మరో 3 నెలలపాటు పొడిగించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది మొత్తం ముగ్గురు సీఎస్‌లతో పాటు మొత్తం 12 మంది ఐఏఎస్‌ల పదవీకాలం పూర్తయింది. వీరిలో నీలం సాహ్ని పదవీకాలాన్ని 6 నెలలు, ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలాన్ని 3 నెలల పాటు పొడిగించారు. ప్రస్తుతం డాక్టర్ సమీర్ శర్మ పదవీకాలాన్ని కూడా పొడిగించే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు.
సీఎస్‌తో పాటు ఈ నెలాఖరులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి కూడా పదవీ విరమణ చేయను న్నారు. కాగా 1985 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మ కేంద్ర సర్వీస్‌ల నుంచి ఈ ఏడాది జూలైలో డిిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. స్మార్ట్ సిటీస్, హౌసింగ్, అర్బన్ అఫైర్స్‌లో అపారమైన అనుభవం ఉంది. ఇందులో భాగంగానే ఆయన నేషనల్ అర్బన్ పాలసీకి రూపకల్పన చేశారు. పట్టణాలు, నగరాభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి నూతన ఆవిష్కరణలకు నాంది పలికారు. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన ఆయన ఏపీ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.