Tuesday, November 19, 2024

AP CS Neerab Kumar – ఫ్రెండ్లీ ఆఫీసర్ … సోమరులకు నో చాన్స్

ఈ ఆఫీసర్ .. యమ సీరియస్..!
నిజాయితీకే గులాం గిరి
అక్రమార్కులకు చంఢశాసనుడు
ప్రజల పక్షం.. న్యాయానికే ప్రణామం
ఏపీ సీఎస్ నీరభ్ గత స్మృతులు

సహనం.. సంయమనం, సమన్వయం ఆయన ఆయుధం ..సరీగా 31 ఏళ్ల కిందట. ఆయన ఓ యువ ఐఏఎస్ అధికారి. మచిలీపట్నం జాయింట్ కలెక్టర్. ఆయనకు అబద్ధం నచ్చదు. అలసత్వం గిట్టదు. నిర్లక్ష్యం అంటే అసలు సహించరు. అన్యాయం తాట తీయటమే తెలుసు. నిజాయితీ, నిబద్ధతకు ఆయన గుండె కరిగిపోతుంది. పని చేస్తే ప్రేమికుడు.. సోమరి పోతుకు చంఢశాసనుడు. రాజకీయ పైరవీకారులకు సింహ స్వప్నం. కేవలం ప్రజల కోసం ..ప్రజల ప్రభుత్వ సేవకుడిగా.. పరిపాలన దక్షుడిగా.. సమర్థ అధికారిగా,, ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న.. ఆ అధికారి ఎవరో కాదు.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. ఓ మంచి అధికారికి, మంచి బాధ్యత లభించిదని మురిసిపోతున్న అటు ఏపీలోని కృష్ణా జిల్లా , ఇటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాల సీనియర్ సిటీజన్ల మధురానుభూతి ఇది.

- Advertisement -

( ఆంధ్రప్రభ స్మార్ట్, మచిలీపట్నం ప్రతినిధి ) ఏపీ నూతన ప్రభుత్వం సమర్థ పరిపాలన కోసం.. పాలన దక్షత కలిగిన ఐఏఎస్ అధికారికి వెతికి పట్టుకుంది. నిస్వార్థ, నిర్భయ, నిర్ణయాలతో ప్రభుత్వ పాలన రథానికి సారథిగా.. నీరభ్ కుమార్ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించిన రోజు నుంచే.. పరిపాలనలో ప్రక్షాళన క్రతువుకు ప్రధాన కార్యదర్శి నడుము కట్టారు. మరీ ముఖ్యంగా పరిపాలన యంత్రాంగానికి కొత్త రూపం ఇస్తూ.. అమరావతి రాజధాని పనులను పునః ప్రారంభించారు. ఇలాంటి అధికారితో 30 కిందటి సీనియర్ సిటీజన్లు తమ అనుబంధాన్ని, అనుభూతిని పంచుకొంటున్నారు.

పశ్చిమ గోదావరిలో ఓనమాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పరిపాలన బాధ్యతలు చేపట్టిన నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 ఐఏఎస్ బ్యాచ్ హీరో. ట్రెయినీ కలెక్టర్ గా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యువ ఐఏఎస్ అడుగు పెట్టారు. ఇక్కడే కలెక్టర్ గిరికి ఓనమాలు దిద్దారు. శిక్షణ అనంతరం వేరే జిల్లాలో (పేరు గుర్తులేదు) సబ్ కలెక్టర్ గా తొలి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. మరో ఐదేళ్ల తర్వాత అప్పటి కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో మే 4 1993 లో జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ హోదాలో ఆయన 1995, ఫిబ్రవరి 5 వరకూ పనిచేశారు.

పనితీరుకే పట్టం

కృష్ణా జిల్లాపై నీరబ్ కుమార్ ప్రసాద్ కు మంచి అవగాహన పెరిగింది. పని విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ….. అబద్దాలను ఎంత మాత్రం సహించ లేదు. పనిని వాయిదా వేసే అధికారులకు గట్టిగానే క్లాసు పీకేవారు. ఇక ఎమ్మెల్యేల సంగతి సరే. ఏ శాసనసభ్యుడి నుంచి ఒత్తిడి వచ్చిన.. ఆ పనిచేయడానికి రూల్స్ ఒప్పుకోవంటూ తనదైన శైలిలో తిరస్కరించటం ఆయన నైజంగా మారింది. ఇక తన అధికారుల పనితీరుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఏ అధికారి తప్పు చేసినా… తనకు సమాచారం అందిన వెంటనే ఆయన తీవ్రంగా స్పందిచటం అలవాటుగా మారింది.


ఎంత సహనమో? … అంత కోపం..!

అధికారుల పనితీరులో…వ్యవహారాల్లో ఎంత సహపం పాటిస్తారో.. దారి తప్పితే అంతకు అంత ఆగ్రహంతో తక్షణచర్యలు తీసుకొంటారు. మచిలీపట్నంలో ఓ రోజు సాయంత్రం ఆయన ఆఫీసులో ఉండగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఫలానా ఫైలు తీసుకుని అర్జెంటుగా రావాలని ఫోన్ చేయించారు. ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగిందో? డీఈవోపై నీరభ్ కుమార్ విరుచుకుపడ్డారు. కోపంగా ” ముందు ఇక్కడ నుంచి పో… అంటూ ఫైలు విసురుగా విసిరికొట్టారు. ‘‘ తప్పుడు సమాచారంతో సంతకాలు చేయిస్తావా? పో ముందు బయటికి పో” అంటూ బెల్లు కొట్టారు ఆ క్షణంలో ఆయన కోపానికి ప్రత్యక్ష సాక్షులు స్టాఫ్ మొత్తం వణికిపోయారు. ఆయనలో అంత కోపాన్ని చూడటం ఇదే తొలిసారి అని సిబ్బంది ఒకరికొకరు చెప్పుకున్నారు. పని విషయంలో ఎంత కచ్చితంగా నిజాయితీగా ఉండే ఈయన పని చేసే సిబ్బందిని, ఫైల్స్ పెండింగ్ లో ఉంచని అధికారులను బాగా అభినందించేవారు.

న్యాయానికే ఊపిరి

తనకు అన్యాయం జరిగిందని బాధితులు ఏకరవు పెడితే.. క్షణాల్లో నీరభ్ కుమార్ ప్రసాద్ తీవ్రంగా స్పందిస్తారు. ఇలాంటి ఘటన ఖమ్మంలో ఒకటి చోటు చేసుకుంది. కృష్ణాజిల్లా నుంచి నీరభ్ కుమార్ ప్రసాద్ ను జిల్లా కలెక్టర్ గా ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు. ఆయన ఖమ్మంలో పని చేస్తుండగా ఓ ఘటనతో జిల్లా డీఈవోపై వేటు పడింది. అదేంటంటే… ఖమ్మం జిల్లాలోని లైబ్రరీలకూ పుస్తకాల సరఫరా నిమిత్తం ఓ పబ్లిషర్ల్ కేటలాగ్ ను జిల్లా డీఈవోకు పంపించారు. కానీ సదరు అధికారి కమీషన్ల మత్తులో పనికి రాని పుస్తకాల జాబితాను తయారు చేసి జిల్లా కలెక్టర్ నీరభ్ కుమార్ ప్రసాద్ కు అందజేశారు. తన పుస్తకాలకు అవకాశం ఇవ్వలేదని పబ్లిషర్ జిల్లాకలెక్టర్ కు మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఈ పుస్తకాలు బాగుంటే కొనుగోలు చేయండని డీఈవోను ఫోన్ లో ఆదేశించారు.

డీఈవోను కలవాలని పబ్లిషర్ ను పంపించారు. కానీ కమీషన్ లు ఇవ్వకుండా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని కోపంతో ఊగిపోయారు. ఆ పుస్తకాలు కొనేది లేదని భీష్మించారు. మళ్లీ ఈ బంతి కలెక్టర్ కోర్టుకు చేరింది. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ స్వయంగా డీఈఓ కు ఫోన్ చేసి వెంటనే గ్రంధాలయ ఫైల్ ను తీసుకురావాలని ఆదేశించారు. ఆ తర్వాత డిఇఓ ఫైలు తీసుకు రావడం, నీరబ్ కుమార్ ప్రసాద్ స్వయంగా అన్ని చూసి డిఇఓ చేసిన మోసం తెలుసుకుని, పబ్లిషర్ కు జరిగిన అన్యాయానికి న్యాయం చేశారు. సెలవు పై వెళ్లాలని నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. విధి నిర్వహణలో ఆయన ఎంత ఖచ్చితంగా ఉంటారో..,తన దగ్గరకు వెళ్లిన బాధితులకు ఎలా న్యాయం చేస్తారో… ఈ ఘటనలు కేవలం ఉదాహరణే. రాజధాని లేని రాష్ట్రంగా.. ఉపాధి కరవు.. నిరుద్యోగ సమస్యతో తల్లడిల్లుతున్న ఏపీ నూతన పరిపాలన ప్రధాన కార్యదర్శి హోదాలో.. అలుపెరగని యోధుడుగా ఈ నీరభ్.. నిర్భయుడిగా .. నిక్కచ్చిగా .. దక్షుడిగా ఎంత మేరకు వ్యవహరిస్తారో… వేచిచూద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement