అమరావతి , ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో పట్టణ ప్రణాళికా విభాగానికి పట్టిన అవినీతి చెద వదలటం లేదు. కొందరు అధికారులు, సిబ్బంది అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. ఆమ్యామ్యాలకు అలవాటుపడి అడ్డగోలు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అక్రమార్కుల కారణంగా పురపాలక సంఘాల పాలకవర్గాలు, ప్రజా ప్రతినిధులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మధ్య అంతరాలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు జారీచేసి వివరణ సంత ృప్తికరంగా లేకపోతే నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశిస్తున్నా అందుకు విరుద్ధంగా పెద్దఎత్తున అనుమతులు మంజూరవుతున్నాయి.
ప్రధానంగా విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, గుంటూరు వంటి ప్రధాన నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో అవినీతి వేళ్లూనుకుంటోంది. ఏడాది క్రితం అవినీతి నిరోధక శాఖ టౌన్ ప్లానింగ్ విభాగంపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించిన సంగతి విదితమే. అయినా అవినీతి తిమింగలాలు తప్పించుకుంటు న్నాయనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా పురపాలక సంఘాల్లో ఈ అవినీతి బాగోతంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. టౌన్‌ప్లానింగ్ అధికారుల నిర్వాకంపై కొన్ని ప్రాంతాల్లో లోకాయుక్తకు స్వయంగా ప్రజా ప్రతినిధులే ఫిర్యాదు చేస్తున్నట్లు తెలియవచ్చింది.
ప్లానింగ్ సెక్రటరీలకు అవగాహన లోపం
కొన్నిచోట్ల సిబ్బంది, అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నా ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే ఒత్తిళ్ల కారణంగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వక తప్పటం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం వార్డు సచివాలయాల్లో నియమించిన ప్లానింగ్ సెక్రటరీల పాత్ర నామమాత్రంగా ఉంటోంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే విషయంలో ప్లాన్ల మంజూరులో వారికి సరైన అవగాహన కల్పించకపోవటం వల్ల నేరుగా టౌన్‌ప్లానింగ్ సిబ్బంది జోక్యం చేసుకుని బేరసారాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఏసీబీ దాడులు నిర్వహించినా అవినీతి అధికారులు, సిబ్బందిపై చర్యలు శూన్యం. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో కమిషనర్ల పదోన్నతులు, బదిలీలపై కూడా గతంలో ఏసీబీ పెద్దఎత్తున విచారణ జరిపింది. పురపాలక, టౌన్ ప్లానింగ్ వి భాగాలపై ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే ప్రశ్నలు వినవస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే కట్టడాలకు మార్టిగేజి విధించాల్సి ఉండగా ఇక్కడే బేరాలు జోరుగా సాగుతున్నట్లు వినికిడి.
కర్నూలులో టీడీఆర్ బాండ్ల వివాదం
రాష్ట్రంలో పురపాలక సంఘాల విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సమీపంలోని గ్రామాలను పురపాలక సంఘాల్లో విలీననం చేస్తూ పట్టణీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు లేకపోలేదు. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో పట్టణ ప్రణాళికాధికారిగా పనిచేసిన ఓ అధికారిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాకుండానే టీడీఆర్ బాండ్స్ విడుదల చేశారని, ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని ఆగమేఘాలపై బదిలీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అదే అధికారికి గుంటూరులో పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిసింది. గుంటూరు నగరంలో కూడా ఇదే రకంగా అడ్డగోలు అనుమతులిచ్చి లక్షల్లో వసూళ్లు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే, విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు కార్పొరేషన్ల పరిధిలో పెద్దఎత్తున పైరవీలు జరుగుతున్నా అధికారులు పెదవివిప్పేందుకు వెనుకాడుతున్నారు. విజయవాడలో ఓ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌పై అవినీతి ఆరోపణలు రావటంతో ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఈ బదిలీని స్థానిక ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నగరంలో 12 మంది బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లకు గాను ఆరుగురు అధికారులకు అయిన వారు మాత్రమే పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. పోస్టు వెరిఫికేషన్ సందర్భంగా పురపాలక సంఘాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పురపాలనలో కమిషనర్లు, పాలకవర్గాలు డమ్మీలవుతున్నారు. మొత్తంగా సంబంధిత నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే అనుమతులు మంజూరవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ప్రభ ుత్వం పరిశీలిస్తోంది. త్వరలో ప్రక్షాళన చర్యలు ప్రారంభించనున్నట్లు తెలిసింది.