అమరావతి, ఆంధ్రప్రభ : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఉపందుకున్నాయి. ఎన్నికల సంఘం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన మీదట ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇక.. తెలుగుదేశం, బిజెపీ, జనసేన కూటమి కూడా తమ క్యాండిడేట్లను ప్రకటించింది. దీంతో.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు స్ధానాలకు బరిలో నిలిపే అభ్యర్ధుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ తరుఫున పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అధిష్టానం ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఆశావాహుల జాబితాను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
అభ్యర్థుల వివరాల సేకరణ..
అభ్యర్ధుల పూర్తి వివరాలపై కసరత్తు చేసిన అధిష్టానం కాంగ్రెస్ అభ్యర్థులను త్వరలోనే ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతోనే అభ్యర్థుల ప్రకటన ప్రారంభించేందుకు ప్రణాళికా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అగ్ర నాయకత్వంలో మంగళవారం జరిగే ఎన్నికల కమిటీ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్ధుల వ్యవహారం కొలిక్కి వస్తుందని నేతలు చెబుతున్నారు.
తొలి జాబితాతో ప్రచారంలోకి..
తొలి జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో ప్రచారం మరింత ముమ్మరం చేసేలా కేంద్ర, రాష్ట్ర నాయకత్వం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే క్రమంలో ఇండియా కూటమిలోని సీపీఐ, సీపీఎంకు లభించే స్ధానాలపై క్లారిటీ రానుంది. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ దృష్టిలో ఉంచుకుని చేరికలను వేగవంతం చేయాలని ఆలోచిస్తున్న అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో గతంలో చురుకుగా పనిచేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకొనే యత్నాలు ముమ్మరం చేసింది. ఈ దిశగా ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన విశాఖ సభ దోహదపడుతోందని అంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో అమలు చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో మాదిరిగా ఏపీలోనూ ఆ తరహా హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ వ్యూహరచన చేస్తోంది.
కడప నుంచి షర్మిల?
అధిష్టానం కొద్దిరోజుల్లో ప్రకటించనున్న రాష్ట్ర అభ్యర్ధుల తొలి జాబితాలో పీసీసీ చీఫ్ షర్మిలతోనే ప్రారంభించాలని నిర్ణయించిన అధిష్టానం ఆమెను కడప లోక్సభ నుంచి బరిలో దింపేందుకు ఆలోచనతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. షర్మిల రాష్ట్ర అసెంబ్లీకి పోటీలో దిగాలని అనుకున్నా.. కడప నుంచి ఆమెను కాంగ్రెస్ తరుఫున లోక్సభలో కూర్చొబేట్టే ఆలోచన అధిష్టానం చేస్తోంది. వైసీపీ లక్ష్యంగా కడప స్ధానాన్ని కొట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఏఐసీసీ పెద్ద నుంచి షర్మిలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన పార్టీ నుంచి వెలువడనప్పటికీ పీసీసీ అధ్యక్షురాలు మాత్రం అంగీకారం తెలిపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.