Monday, November 25, 2024

AP – వాణిజ్య పన్నుల శాఖలో అరాచకాల్ని అరికట్టాలి – ఉద్యోగ సంఘాల డిమాండ్

కర్నూల్ బ్యూరో – వాణిజ్య పన్నుల శాఖలోని ఆరాచకాన్ని అరికట్టాలి అంటూ ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్ష, ఏడి రఘురామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.పి. అబ్దుల్లా సాహెబ్ ప్రభుత్వాన్ని కోరారు.

స్థానిక కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయానికి వెన్నెముకగా ఉంటూ, రాష్ట్ర ఖజానాకు ఆధార భూతంగా ఉన్న వాణిజ్య పన్నుల శాఖలోని కొంత మంది ఉన్నతాధికారులు సాగించిన ఆరాచక విధానాల వల్ల గాడి తప్పిందన్నారు.వీరి కబంధ హస్తాల నుండి శాఖను రక్షించి, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ చేసిన తీర్మానాలను వారు వివరించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలైన అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా శాఖలో అధికారాల కేంద్రీకరణ జరిగిందన్నారు.అన్ని అధికారాలను ప్రధాన కార్యాలయంలోని కొంత మంది అధికారులు తమ వద్దే ఉంచుకొని, క్షేత్రస్థాయిలోని సర్కిల్ కార్యాలయాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

- Advertisement -

గత ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలతో కుమ్మకై కాఖ పునర్వ్యస్థీకరణ పేరుతో ప్రభుత్వాన్ని పక్క దోవ పట్టించడం జరిగిందన్నారు. వీటికి బాధ్యులైన కొంతమంది ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారన్నారు. దీనిపై గత ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకొలేదన్నారు.

పునర్వ్యవస్థీకరణ పేరుతో వందలాది క్రిందిస్థాయి పోస్టులను రద్దుచేసి, చిన్న ఉద్యోగులను, నిరుద్యోగులను వంచించారన్నారు. పై స్థాయిలో అధికారుల పోస్టులను పెంచుకొని, ప్రమోషన్లు వస్తున్నాయని ఉద్యోగులను మభ్యపెట్టారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) విరుద్ధంగా, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘించి బదిలీలు చేసినట్లు వాపోయారు. పునర్ వ్యవస్థీకరణ పేరుతో జరిగిన ప్రహసనం వల్ల, వందలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు.

బదిలీల పేరుతో కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసి, డిప్యూటేషన్ పేరుతో వెనక్కు పంపిన విషయాన్ని గుర్తు చేశారు.కొంతమందిపన్ను ఎగవేతదారులతో కుమ్మకైన ఉన్నతాధి కారులు వీటిని చేసినట్లు ఆరోపించారు.ఈ ఎగవేతదారుల కార్యకలాపాలు ఎవరు అడ్డుకోకూడదనే ఉద్దేశ్యంతో, సర్కిల్ స్థాయి, జిల్లా స్థాయి,కేంద్ర కార్యాలయం మూడు ప్రాంతీయ కార్యాలయాల వద్ద అధికారాలన్నీ అట్టిపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పన్ను ఎగవేస్తూ సరైన పత్రాలు లేకుండా, ఏదైనా వాహనం వెళు తుందని తెలిసినా, దానిని ఆవడానికి కానీ, తనిఖీ చేయడానికి కానీ, స్థానిక అధికారులకు ఎటువంటి అధికారాలు లేకుండా చేశారన్నారు. ఏదైనా వాహనాన్ని తనిఖీ చేయాలన్నా కేంద్ర కార్యాలయంలోని ఉన్నతాధికారుల అనుమతి ఉండాలి. ఈ విదంగా అధికారాలన్ని తమ గుప్పెట్లోపెట్టుకొని, పన్ను ఎగవేతదారులతో కుమ్మకైన ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపించారు. తప్పుడు పనులు చేస్తూ తమను ఎవరూ ఏమీ చేయలేరనే స్థాయిలో బరితెగించారన్నారు.

గత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి విరుద్ధంగా తమకు అడ్డు అదుపు లేకుండా చేసుకున్నారన్నారు.వీరి చీకటి వ్యవహారాలను వాణిజ్య పన్నుల సర్వీసెస్ అసోసియేషన్ ప్రశ్నించడంతో, సంఘనాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలకు పంపినట్లు ఆవేదన వ్యక్తపరిచారు.సంఘ గుర్తింపును రద్దు చేయడానికి సిద్దపడడంతో, న్యాయస్థానం జోక్యం చేసుకొని ఆపిందన్నారు.

ఈ విధంగా వాణిజ్య పన్నుల శాఖలోని కొంత మంది ఉన్నతాధికారులు తమ అడ్డగోలు సంపాదన కోసం, శాఖను నిర్వీర్యం చేస్తూ, క్రిందిస్థాయి ఉద్యోగులను బలి పశువులు చేస్తున్నారన్నారు. అన్ని చట్టాలకు, నిబంధనలకు తాము ఇతరులం అనే ధోరణితో,ఇష్టారీతిన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. వీటివల్ల శాఖ గతి తప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను ఎగవేతదారులతో కుమ్మకై ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారన్నారు.ఏ ప్రభుత్వం వచ్చినా తమను ఏమీ చేయలేరనే అహంకార ధోరణితో ఉన్న వీరి బారి నుండి శాఖను రక్షించాలని కోరారు.

గత ఐదేళ్లుగా వీరు చేసిన అకృత్యాలు వెలుగులోకి తేవడం కోసం లోకాయుక్త విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లేదా ఎ.సి.బి. వంటి సంస్థలతో పూర్తిస్థాయి దర్యాప్తు చేయించి శాఖను ప్రక్షాళన చేయాలని వాణిజ్య పన్నుల సర్వీసెస్ అసోసియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement