Friday, November 22, 2024

కెసిఆర్ పై మంత్రి సిదిరి కామెంట్స్ – అప్ప‌ల‌రాజుపై ఏపీ సీఎంఓ ఫైర్..

అమ‌రావ‌తి – ఎపి ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ మంత్రి సిదిరి అప్ప‌ల‌రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎపి సిఎంవో తీవ్రంగా స్పందించింది. ఎవరిపై అయినా కామెంట్స్ చేసేముందు జాగ్రత్తగా మాట్లాడాలని అమాత్యుడిని హెచ్చరించింది. నేతల స్థాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అనే దానిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలంటూ సీరియస్ అయ్యింది సీఎంఓ. ఇదే విషయాన్ని సీఎంవో వర్గాలు అనాధికారికంగా పేర్కొన్నాయి. మాటలు జాగ్రత్త అంటూ సిదిరికి క్లాస్ పీకింది.


కాగా, బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేస్తే జాతీయ పార్టీ అయిపోతుందా? అని ప్రశ్నించారు. ఆ పార్టీకి ఏ కోశానైనా జాతీయ వాదం ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అంతా ప్రాంతీయ వాదులు అని సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణకు నాయకులు అయ్యారని ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు సీదిరి అప్పలరాజు. అంతేకాదు.. ఆంధ్రా ప్రజలు తెలంగాణకు రావడం మానేస్తే అడుక్కు తినడం తప్ప.. అక్కడ ఏమీ ఉండదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు అప్పలరాజు. తెలంగాణ రాజకీయాలు ఏపీలో ఏమాత్రం పని చేయవని అన్నారు మంత్రి. ఇవే కాకుండా రాయకూడని భాషలో చాలా కామెంట్స్ చేశారు మంత్రి అప్పలరాజు. ఈ వ్యాఖ్యలు ప్రింట్, ఎల‌క్ర్టానిక్ మీడియాలో రావ‌డంతో వెంట‌నే దాంతో ఏపీ సీఎంవో స్పందించింది. మంత్రి చేసిన కామెంట్స్‌పై సీరియస్ అయ్యింది. నోరు అదుపులో పెట్టుకోవ‌లంటూ స్వంత మంత్రిని హెచ్చ‌రించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement