Tuesday, November 26, 2024

AP | వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన..

అమరావతి, ఆంధ్రప్రభ: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోమ, మంగళవారాల్లో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కోనసీమ జిల్లాల్లోని వరద బాధితులతో నేరుగా సీఎం మాట్లాడనున్నారు. ఈమేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. అక్కడ గోదావరి వరదల ప్రభావిత ప్రాంతాలు, సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడిన అనంతరం కూనవరం బస్‌స్టాండ్‌ సెంటర్‌లో కూనవరం, వీఆర్‌ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు.

ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ పరిశీలన చేస్తారు. అనంతరం వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం తర్వాత రాత్రికి అక్కడే బస చేస్తారు.

- Advertisement -

8వ తేదీ మంగళవారం ఉదయం 9.10 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ నుంచి బయలుదేరి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత తానేలంక రామాలయంపేట గ్రామం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement