Tuesday, November 19, 2024

ఓటీఎస్‌పై సీఎం జగన్ కీలక నిర్ణయం.. డిసెంబర్‌ 21 నుంచే రిజిస్ట్రేషన్‌!

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం(ఓటీఎస్‌)పై అవగాహాన కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, ఓటీఎస్‌ పథకంపై సీఎం జగన్‌ బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో​ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఓటీఎస్‌పై అవగాహాన కల్పించాలని, ఓటీఎస్‌ అనేది పూర్తి స్వచ్ఛందమని అన్నారు. రూ.10వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్‌ కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ జరుగుతోందని సీఎం పేర్కొన్నారు. వారికి సంపూర్ణ హక్కులు వస్తాయని, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు.. అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామన్న సీఎం జగన్.. ఆ అవకాళాలు వాడుకోవాలా? లేదా? అన్నది వారిష్టమని చెప్పారు. డిసెంబర్‌ 21 నుంచే రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వడం ప్రారంభమవుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణాలు చెల్లించిన 43 వేల మందికి కూడా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామన్నారు. వారికి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తామన్నారు. భవిష్యత్తులో గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతాయని సీఎం వెల్లడించారు.

ఇక, రాష్ట్రంలో గృహనిర్మాణంపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని  సీఎం జగన్ అన్నారు. కోర్టు కేసులు పరిష్కారం అయ్యాయని చెప్పారు.  వర్షాలు కూడా ఆగిపోయాయన్న సీఎం.. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం విషయంలో గేర్‌ మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు. గృహ నిర్మాణంలో నాణ్యత బాగుండాలని,  దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.  సొంతంగా ఇళ్లు కట్టుకునేవారికి నిర్మాణంలో మంచి సలహాలు ఇచ్చేలా చూడాలన్నారు. ఇళ్లు క్వాలిటీతో కట్టుకునేలా చూడాలని సూచించారు. ఇంటి నిర్మాణ ఖర్చులను తగ్గించేలా అన్ని రకాల విధానాలూ అవలంభించాలని చెప్పారు. నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకలు ఆయా కాలనీలకు సమీపంలోనే తయారయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. లేబర్‌ క్యాంపు, సిమెంటు గోదాములు వంటివి లేఅవుట్లలో ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలన్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి సీఎం జగన్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement