రాష్ట్రంలోని కౌలురైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. క్యాంప్ కార్యాలయంలో 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు ధన్యవాదాలు తెలిపారు. గడచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గిందన్నారు. మరుసటి ఏడాది అంటే 2020–21లో కూడా కోవిడ్ విస్తరణను అడ్డుకోవడానికి లాక్‌డౌన్, ఇతరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగిందని చెప్పారు.
దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయిందన్న సీఎం.. మొదటి త్రైమాసికంలో అయితే 24.43 శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయిందన్నారు. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందని తెలిపారు. 2020–21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో 2.58 శాతానికి పరిమితమైందన్నారు. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నాన్నట్లు చెప్పారు.
గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్ రుణాలు రూ. 3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని.. వ్యవసాయరంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోందని అన్నారు. అదే సమయంలో పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం అని సీఎం జగన్ పేర్కొన్నారు. కౌలు రైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బ్యాంకర్లను కోరిన సీఎం.. ఇప్పటివరకూ 4,91,330 క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్స్ (సీసీఆర్‌సీ)లను ఇచ్చామని చెప్పారు. వీరికి సీసీఆర్‌సీ కార్డులను ఇవ్వడమే కాదు, ఆ డేటాను ఈ–క్రాపింగ్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. వీరంతా నిజంగా పంటను సాగుచేస్తున్న రైతులని, వీరి విషయంలో బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలి కోరారు.
ఇది కూడా చదవండి: Drug Case: ముగిసిన రవితేజ విచారణ.. 6 గంటల పాటు ప్రశ్నలు