Friday, November 22, 2024

మీరాబాయి ఎందరికో స్ఫూర్తి.. ఏపీ సీఎం జగన్ అభినందనలు

టోక్యో ఒలింపిక్స్-2020 వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించిన మీరాబాయి చానుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ‘క్రీడోత్సవాలు ప్రారంభ దశలోనే వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ రజత పతకం సాధించడం సంతోషించదగ్గ విషయం. మహిళల విభాగంలో భారత్ పతకం సాధించి టోక్యో ఒలింపిక్స్ లో శుభారంభం చేసి భారత కీర్తిని ఇనుమడింపజేశారు. దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మీరాబాయికి ఆంధ్రప్రదేశ్ తరపున, రాష్ట్ర ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఆమె విజయం ఎందరికో స్ఫూర్తి.. మరెందరికో ఆదర్శం’ అని  సీఎం జగన్ అన్నారు.

మణిపూర్ కు చెందిన మీరాబాయి చాను.. 49 కేజీల విభాగంలో స్నాచ్ లో 87.. క్లీన్ అండ్ జర్క్ లో 115.. మొత్తంగా 202 కిలోలు ఎత్తి సగర్వంగా సిల్వర్ మెడల్ ను ముద్దాడింది. భారత ఈశాన్య రాష్ట్రంలోని మణిపూర్ రాజధాని ఇంఫాల్ ప్రాంతంలోని నాంగ్ పాక్ కాక్ చింగ్ లో సాధారణ కుటుంబంలో జన్మించింది మీరాబాయి. 12ఏళ్ల వయసులో వెయిట్ లిఫ్టింగ్ లో కుంజరాణి దేవిని చూసి స్ఫూర్తి పొందింది. వంట కోసం అడవికి వెళ్లి కట్టెలమోపును మోయడమే ఆమెకు తొలి శిక్షణగా మారింది. అటుపై ఖరీదైన వెయిట్ లిఫ్టింగ్ లో రోజూ 60 కిలోమీటర్లు వెళ్లి శిక్షణ పొందేది. అక్కడ మొదలైన ఆమె పయనం.. నేడు టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం వరకూ కొనసాగింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో భారత్ తరపున వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్యం సాధించిన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి తర్వాత ఇన్నేళ్లకు వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు మెడల్ రావడంతో దేశం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.

ఇది కూడా చదవండిః టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలి పతకం

Advertisement

తాజా వార్తలు

Advertisement