Sunday, November 17, 2024

AP – విద్యుత్ ఘాత మృతుల కుటుంబాల‌ను ఆదుకుంటాం – చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – తూర్పుగోదావరి జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీ కడుతూ వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ అనే నలుగురు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం చంద్రబాబు..

హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి..

ఇక, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత.. సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో భాగంగా ప్రమాదం జరగడం చాలా బాధకరమన్నారు. ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ షాక్ తో మరణించిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు ప్రమాదవశాత్తు అకాల మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకునే ధైర్యం వారి తల్లిదండ్రులకు భగవంతుడు ప్రసాదించాలని వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తణుకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించి కాపాడాలని వైద్యాధికారులను ఆదేశించారు హోం మంత్రి అనిత.

- Advertisement -

విద్యుత్ షాక్ బాదిత కుటుంబాల‌ను ఆదుకుంటాం … మంత్రి కందుల దుర్గేష్‌..

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపరులో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమాల్లో భాగంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. విష‌యం తెలిసుకున్న మంత్రి కందుల దుర్గేష్ మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు కరెంట్ షాక్ కు గురై మృతి చెందిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఇక, ప్రమాదానికి గల కారణాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి దుర్గేష్.. మృతుల కుటుంబాలకు అధైర్య పడవద్దని, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ధైర్యం చెప్పారు.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. అయితే, తొలి కార్తిక సోమవారం. అందరూ ఉదయాన్నే శివాలయాల్లో దీపారాధనకు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలోనే ఆ ఊరిలో నలుగురు యువకులు చనిపోయరని ఆవేదన వ్యక్తం చేశారు..

మంత్రి కొల్లు, నిమ్మ‌ల‌ సంతాపం ..

రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో విద్యుదాఘాతంతో నలుగురు మృతి అత్యంత బాధాకరం అన్నారు.. ప్రమాదంలో మరణించిన వారికి నా ప్రగాఢ సాుభూతిని తెలియజేస్తున్నా.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రమాద ఘటనపై విచారణ జరిపించి వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర.. ఇక, విద్యుదాఘాత మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు మంత్రి నిమ్మల రామానాయుడు. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటాం అన్నారు.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement