అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ సివిల్ కోర్టు చట్ట సవరణ బిల్లు శాసనసభ ఆమోదం పొందింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి తరపున పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం బిల్లును సభ ముందుంచారు. అఖిల భారత న్యాయమూర్తుల అసోసియేషన్ వర్సెస్ కేంద్రప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఆదేశానుసారం సివిల్ న్యాయస్థానాల చట్టం- 1972కు ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. ఈ ప్రకారం ఇప్పటి వరకు జూనియర్ సివిల్ న్యాయమూర్తి పదవిని సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్), సీనియర్ సివిల్ న్యాయమూర్తికి బదులుగా సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్)గా సవరణలు తీసుకొస్తూ ఏపీ సివిల్ కోర్టు చట్ట సవరణ బిల్లు-2023ను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఆ తరువాత జిల్లా న్యాయమూర్తి హోదాను అమల్లోకి తెచ్చింది. మొదటి జాతీయ జుడీషియల్ పే కమిషన్ (ఎఫ్‌ఎన్‌జేపీసీ), ఎ స్‌ఎన్‌జేపీసీ సూచనలకు అనుగుణంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.. భారత సర్వోన్నత న్యాయస్థానం దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నామ పరిభాషను మార్చాలని అన్ని ఉన్నత న్యాయస్థానాలను ఆదేశించింది. సఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించి సివిల్ న్యాయస్థానాల చట్టం -1972, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా నియమావళి- 2007 ప్రకారం న్యాయాధికారులను జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్‌ఒ సివిల్ జడ్జి, జిల్లా జడ్జిలుగా పిలుస్తున్నారు.
ఈ ఏడాది మే 19వ తేదీన ఎఫ్‌ఎన్‌జేపీసీ, ఎస్‌ఎన్‌జేపీసీ ఉత్తర్వుల ద్వారా సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశాలను ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించింది. దీనిపై తదుపరి చర్యలకు సీజే ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నియమాల కమిటీకి నిర్దేశించారు. సివిల్ కోర్టు నామ పరిభాషలో మార్పులకు సంబంధించి రాష్ట్రంలో ఒకేరీతిగా న్యాయమూర్తుల నామ పరిభాష ఉండేలా చట్ట సవరణలకు ఆస్కారం ఏర్పడింది. ఇందుకు అనుగుణంగా హైకోర్టు రిజి స్ట్రీ తదుపరి చర్యలు చేపడతారు.