ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటిస్తున్నారు.. అనుకున్నట్టుగానే ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి పోలవరం చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. హెలికాప్టర్‌లో అక్కడకు చేరుకున్న చంద్రబాబు నేరుగా పోలవరం సందర్శించారు. ముందుగా ఆయన హెలికాప్టర్ ద్వారా పోలవరం నిర్మాణాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు..
అనంతరం అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్‌బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 22, 23 గేట్ల నుంచి ప్రాజెక్టు పరిసరాలను చూశారు.
ఇj మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరిగి రానున్నారు.