అధ్వానంగా చింతూరు – సీలేరు రహదారి
అడుగుకో గుంత.. గజానికో గొయ్యి
చినుకుపడితే చెరువులను తలపిస్తున్న రోడ్డు
పూర్తిగా ధ్వంసమైన అంతరాష్ట్ర రహదారి
నిత్యం ఇబ్బంది పడుతున్న వాహనదారులు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు నుంచి సీలేరు వరకు వెళ్లే చింతూరు – విశాఖపట్నం అంతరాష్ట్ర రహదారి నరకానికి నకళుగా మారింది. ఈ రోడ్డుపై ఏ వాహనంలో వెళ్లినా ఉయ్యాలా.. జంపాలా అనాల్సిందే. అంతగా గోతులమయమైంది. అడుగుకో గుంత.. గజానికో గొయ్యి అన్నట్లు తయారైంది. ఈ దారిలో ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు. బైకుల మీద వెళ్లే వారైతే వెన్నుపూస విరిగినంత పనై పోతుందని వాపోతున్నారు. గుంతల్లో వాహనాలు నడపడం వల్ల తరచూ రిపేర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డొంకరాయి (అనిల్ కుమార్), (ఏఎస్‌ఆర్ జిల్లా), (ఆంధ్రప్రభ): చింతూరు నుంచి సీలేరు వరకు విశాఖపట్నం రోడ్ ధ్వంసమై అస్తవ్యస్తంగా మారింది. ఆంధ్రా, చత్తీష్‌ఘడ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన ప్రజలు డొంకరాయి, సీలేరు, చింతపల్లి, అనకాపల్లి, రాజమండ్రి, అల్లూరి జిల్లా పాడేరు, విశాఖపట్నంకు వెళ్లాలి అంటే ఈ రోడ్డు వెంటే వెళ్లాల్సి ఉంటుంది. అడుగడుగునా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇక వాన పడితే చాలు రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి చిన్నపాటి చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి.
రహదారి ధ్వంసం
చింతూరు మండలంలోని మోతుగూడెం నుండి మొదలుకొని ఒడియాక్యాంప్ వరకు 16 కిలో మీటర్ల మేర, వైరామవరం మండలంలోని ఆలేరు వాగు మొదలుకొని బచ్చులూరు వరకు 28 కిలో మీటర్ల వరకు అంతరాష్ట్ర రహదారి పూర్తిగా ధ్వంసమైంది. పాలగడ్డ గ్రామం నుంచి బచ్చులూరు వరకు మరింత అధ్వానంగా రాళ్లు తేలిపోయాయి. రోడ్డుపై గోతుల్లో నీరు నిలిచి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మోకాళ్ళలోతు గోతులు ఉండటంతో ఆటోవాలాలు, ద్విచక్ర వాహన, భారీ వాహన చోదకులు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. రహదారి పరిస్థితి చూస్తూ కూడా అధికారులు, పాలకుల్లో చలనం లేదు. రహదారి బాగు చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.