Friday, November 22, 2024

AP | ఆరుద్రకు ముఖ్యమంత్రి అభయం..

అమరావతి, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును తన కుమార్తెతో వచ్చి కలిశారు. కాకినాడకు చెందిన ఆరుద్ర గత ప్రభుత్వ హయాంలో తాను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులను ముఖ్యమంత్రికి వివరించారు.

తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రకు వెన్నులో కణితి ఏర్పడటంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యిందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గతంలో బిడ్డ వైద్య ఖర్చుల కోసం తన ఆస్తులు అమ్ముకునే ప్రయత్నంలో తనకు ఎదరైన కష్టాలను ఆమె వివరించారు. అమలాపురంలో తన స్థలం విక్రయంలో ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరుద్ర సమస్యలపై స్పందించిన సీఎం కుమార్తె సాయిలక్ష్మీ చంద్రకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో ఉన్న స్థల వివాదంపై ప్రభుత్వపరంగా ఎంత వరకు సాయం చేయవచ్చు అనేది కూడా పరిశీలించి , అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మీ గెలుపుతో తన కష్టాలు తీరిపోయినట్లు అనిపించిందని, ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉందని ఆరుద్ర భావోద్వేగానికి గురయ్యారు. సీఎం ఇచ్చిన భరోసాతో ఆరుద్ర సంతోషం వ్యక్తం చేశారు.

గతంలో తన సమస్యను అప్పటి సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ప్రయత్నించగా స్పందించక పోగా, ఎదురు కేసులు పెట్టి, వివాదాలు సృష్టించి, తనను మానసిక హింసకు గురిచేశారని, పిచ్చిదాన్ని అనే ముద్ర వేశారని ఆమె కన్నీటిపర్యంతం అయ్యారు. ఆరుద్ర కష్టాలు విన్న ముఖ్యమంత్రి…ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటానని ఆమెకు భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement