అమరావతి, ఆంధ్రప్రభ: ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ బీజేపీ సన్నద్ధమవుతోంది. ప్రధాని మోడీ 7,8 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట సహా పలు ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నట్లు కేంద్ర బీజేపీ నుంచి ఏపీ నేతలకు సమాచారం అందింది.
8న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు రోడ్ షోలో ప్రధాని పాల్గొంటారు. ప్రధాని పర్యటన వివరాలను తొందరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మోడీ రాక నేపధ్యంలో బుధవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఎన్‌టీఆర్ జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది.
అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఏపీ బీజేపీ ఎన్నికల కో ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్, ఎన్నికల సమన్వయకర్త పేరాల చంద్రశేఖర్ పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్థేశం చేశారు. మోడీ రాకను పురస్కరించుకొని పార్టీ పతాకాలతో నగరాన్ని అలంకరించాలని వారికి సూచించారు.
సమీక్షా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, రాష్ట్ర నేత ఉప్పలపాటి శ్రీనివాస్ రాజు, రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం, ముఖ్య నేతలు మువ్వల వెంకట సుబ్బయ్య, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఇన్‌చార్జి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.