విశాఖపట్నం: ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు… గత వైసిపి ప్రభుత్వం హయాంలో రుషికొండపై నిర్మించిన భవనాలను మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు నేడు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ బిల్డంగ్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయ్యిందంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు.. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి సాధ్యమేనా ప్రశ్నించారు. ఓ వ్యక్తి తన విలాసాల కోసం ఇలాంటి ప్యాలెస్ లు ప్రజాధనంతో కడతారా.? అని ఆశ్చర్యపడ్డారు. ఎవరో రాజుల కాలంలో, నియంతల పాలనలోనే ఇలాంటి నిర్మాణాలు చూసేవాళ్లమన్న సీఎం.. జగన్ ఆధునిక నియంత అనుకున్నారా.? అని ప్రశ్నించారు. జీవితాంతం తానే సీఎంగా ఉంటారనుకుని ఇలా ప్యాలెస్ లు కట్టుకుని ఉంటారని అన్నారు.
ఒక్క స్నానం చేసే టబ్బు కోసం రూ. 36 లక్షలు, కమోడ్ కోసం రూ. 12 లక్షలు ఖర్చు చేయడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. ప్రజల సొమ్ముతో ఇలాంటి కట్టడాలు కట్టాలంటే కరుడుగట్టిన నేరస్తుల వల్లే అవుతుందన్న చంద్రబాబు, అన్నింటికీ తెగిస్తేనే ఇలాంటివి చేయగలరని అన్నారు. బయటి ప్రపంచం అంతా విమర్శిస్తున్నా, మీడియా ఏం జరుగుతుందో చెప్పాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎవరినీ లోపలికి రానివ్వలేదని అన్నారు.
ఆకరికి తాను ప్రయత్నించినా, జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నించినా.. ఈ కట్టడం దగ్గరకు రాకుండా జగన్ అడ్డుకున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం చాలా బలమైందన్న సీఎం చంద్రబాబు.. ఏ అధికారంతో అయితే జగన్ తమను అడ్డుకున్నారో.. అదే అధికారం ఇప్పుడు తమకు దక్కిందని, ఇప్పుడు ఈ బిల్డింగ్ ను ఏం చేయాలో నిర్ణయించే అధికారం తమదేనన్నారు. తాను చాలా దేశాలు తిరిగాన్న చంద్రబాబు.. ఇలాంటి ప్యాలెస్ ను ఎక్కడా చూడలేదని ఆశ్చర్యపడ్డారు.
ఉత్తరాంధ్ర కోసం ఏం చేశారు.?
ఆర్థికంగా వెనుకబడ్డ ఉత్తరాంధ్రాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ.400 కోట్లు కూడా ఖర్చు పెట్టని జగన్ ప్రభుత్వం.. తన విలాసాల కోసం కట్టుకున్న ఈ ప్యాలెస్ కోసం మాత్రం ఏకంగా 450 కోట్లు ఖర్చు చేయడం దుర్మార్గమని అన్నారు. అక్కడి విలాసాలకు డబ్బుల్ని మంచి నీళ్లలా ఖర్చు చేశారన్న చంద్రబాబు.. దేశీయంగా అన్ని వ్యవస్థలను తప్పుదోవ పట్టించి ఈ నిర్మాణం చేశారని అన్నారు. జగన్ ఉత్తరాంధ్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినా.. తమకు మాత్రం విశాఖలో పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయన్నారు. ఇప్పుడు వాళ్లంతా తాము ఎలాంటి పరిపాలన అందిస్తామోనని ఎదురుచూస్తున్నారని అన్నారు.
రుషికొండ ఫ్యాలెస్ పనికిరాదు
తాను జీవితంలో అనేక ప్రాంతాలు తిరిగామన్న చంద్రబాబు.. ఎన్నో రాజ భవనాల్ని చూశానని, కానీ ఇలాంటి బిల్డింగును మాత్రం చూడలేదని, ఈ నిర్మాణాలు చూస్తుంటే తనకు మైండ్ పోతుందని ఆశ్చర్యపడ్డారు. తాను కలలో కూడా ఇలాంటి నిర్మాణాలు చేసి ఉంటారని ఊహించలేదన్న చంద్రబాబు.. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు.
”గత ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు రూ.400 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈ నిధులు ఖర్చు పెడితే రోడ్లపై గుంతలు పూడ్చటం పూర్తయ్యేది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికివస్తారా? ప్రజలు ఆలోచించాలి. ఈ భవనాలు అందరికీ చూపిస్తాం. వీటిని దేనికి వాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టడం ఏమిటో అర్థం కాలేదు. ప్రజలంటే ఎంతో కొంత భయం ఉంటే సమాధానం చెప్పాలి. ప్రజాధనం దోచుకుని గతంలో ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉంటాననే భ్రమలతో ఇలాంటివి కట్టారు. విశాఖ ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి తప్పుడు పనులు చేశారు” అని చంద్రబాబు విమర్శించారు.