Saturday, September 14, 2024

AP – బాధితులకు అండగా ఉందాం… సాయం కోరితే తక్షణమే స్పందించండి – చంద్రబాబు

ఎమ్మెల్యేలంతా వరద ప్రాంతాలకు వెళ్లాలి
ప్రజలకు దైర్యం చెప్పండి.. అందరినీ ఆదుకోవాలి
వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న మంత్రులు

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. వరస సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై ఆరా తీస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలకు ధైర్యం కల్పిస్తున్నారు. అధికారులు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి తక్షణమే సహాయక చర్యలు మరింత ఉద్ధృతం చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

క్యాంప్ కార్యాలయం నుంచి …

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు. ఏపీలో భారీ వర్షాలపై సీఎం ఆరా తీశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి భారీ వర్షాలు, ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులపై వివరించారు. రాష్ట్రంలో వర్షాలు కాస్త నెమ్మదించినా చాలా ప్రాంతాల్లో ఇంకా వరదలు కొనసాగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. పలు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్లు నడుస్తున్నాయని వివరించారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీసులు విస్తృతస్థాయిలో సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. అయితే సహాయం కోరే ప్రతి ఒక్కరి వద్దకు తక్షణమే సహాయక బృందాలు వెళ్లేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

మంత్రి అనగాని సమీక్ష..

మరోవైపు భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. వరదల్లో ప్రజలు చిక్కుకొని ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల రక్షణ నిమిత్తం రెవెన్యూ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. క్షణక్షణం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పుకొచ్చారు. వర్షాలు మరో 24గంటలపాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని ఆదేశించారు. విధుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని ఆదేశించారు.

విద్యుత్తు సరఫరాపై మంత్రి గొట్టి పాటి ఆరా

భారీ వర్షాల వల్ల విద్యుత్ శాఖకు జరిగిన నష్టంపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీటీపీఎస్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో 2500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగిందని గొట్టిపాటి వెల్లడించారు. వర్షపు నీటిని తోడే పనులు నిర్విరామంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం పోలవరం నుంచి నీరు తోడే పంపులు తెప్పిస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement