ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో భేటీ అయ్యారు. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు సీఎంకు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన అందరూ మంత్రులు ఈ భేటీకి హాజరు అయ్యారు. పవన్ కల్యాణ్ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదు. ఈ భేటీలో మంత్రులకు కేటాయించాల్సిన శాఖలపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రులతో భేటీ అనంతరం చంద్రబాబు తిరుమలకు కుటుంబంతో కలిసి బయలుదేరి వెళ్లారు.
మొదటి సంతకం ఆ ఫైళ్లపైనే.
నేడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు.. రేపు గురువారం సాయంత్రం 4:41 గంటలకు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, సామాజిక పింఛన్ రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు దస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. అనంతరం అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వంటి వాటిపైనా ఆయన ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది.