లబ్దిదారులతో ఆప్యాయ పలకరింత
ఇంటిలోకి వెళ్లి వారి కష్ట సుఖాలు తెలుసుకున్న సిఎం
స్వయంగా కాఫీ కాచి లబ్దిదారుడి కుటుంబానికి ఇచ్చిన చంద్రబాబు
లబ్దిదారుడికి పించన్ తో పాటు అయిదు లక్షల సాయం
మరో లబ్దిదారుడికి గృహం కేటాయింపు..
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ ప్రారంభించింది . ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో లబ్దిదారు శారమ్మ ఇంటికి వెళ్లారు.. ముందుగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శారమ్మ కుటుంబ సభ్యులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. వారి కుటుంబంతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బాగా చదువుకోవాలని శారమ్మ పిల్లలకు చంద్రబాబు సూచించారు. చురుకుగా ఉన్నారని, బాగా చదివితే మంచి స్థాయికి వస్తారని వారిని ఆశీర్వదించారు. అనంతరం రూ.4 వేల పింఛన్ ను స్వయంగా చంద్రబాబు అందజేశారు.
అదనంగా రూ.5 లక్షలు సాయం .
అనంతరం మరో పింఛన్ లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లారు చంద్రబాబు. నేరుగా వంట గదిలోకి వెళ్లిన ముఖ్యమంత్రి కాఫీ పెట్టారు.. తన స్వహస్తాలతో కుటుంబ సభ్యులందరికి ఇచ్చారు. అనంతరం వారి కుటుంభ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏడుకొండలు ముఖ్యమంత్రితో మాట్లాడుతూ, తనకు టీ షాప్ పెట్టుకునేందుకు రూ.5 లక్షల లోన్ ఇవ్వాలని అభ్యర్ధించారు. స్పందించిన చంద్రబాబు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేందుకు లోన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని కోదండరామస్వామి దేవాలయాన్ని చంద్రబాబు దర్శించుకున్నారు.