నరేడ్కో ప్రాపర్టీ షోలో సీఎం చంద్రబాబు వెల్లడి
ఇప్పటికే ఈ రంగానికి ₹4 లక్షల పెట్టుబడులు వచ్చాయి
ఈ రంగంపై 34 లక్షల మంది ఆదారపడి ఉన్నారు
రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం
కేంద్రం సహకారంతో పెద్ద ఎత్తున నిర్మాణాలు
గుంటూరు, ఆంధ్రప్రభ:
పూర్తిగా పతనమైన భవన నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేపనిలో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.. గత అయిదేళ్లలో ఈ రంగం పూర్తిగా పతనమైందన్నారు. 34 లక్షల మందికి పైగా ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని, దీంతో దీనిపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని చెప్పారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు అన్ని రంగాలనూ పతనావస్థకు తీసుకొచ్చారని.. రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారని విమర్శించారు. పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
అందుకే ఉచిత ఇసుక పాలసీ..
కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రంగం అధ్వానంగా మారిందన్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్ నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ప్రధాని మోదీ విశాఖకు వచ్చి ₹2లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తుందని చెప్పారు. నిర్మాణ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.. 34లక్షల మంది ఆధారపడి ఉన్న ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, ఉచిత ఇసుక విధానం తెచ్చామని అన్నారు. ఈ రంగం అభివృధికి నరెడ్కో, క్రెడాయ్ వంటి సంస్థలు కలిసి ముందుకు రావాలని పిలుపుఇచ్చారు. ఇదే సందర్భంగా రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారానికి ముందుంటామని హామీ ఇచ్చారు..
భూ అక్రమాలతో ఇబ్బందులు ..
గత ప్రభుత్వం చేసిన భూకబ్జాలతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎప్పుడూ చూడనివిధంగా భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయని అన్నారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకంతో టీడీఆర్ బాండ్లు తీసుకుని కొంతమంది నష్టపోయారని తెలిపారు.
నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు..
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నామని సీఎం చెప్పారు.. తాము వచ్చాక ₹4లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 20లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.