అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్త, దివంగత రతన్ టాటా పేరుతో ఎపిలో ఇన్నోవేషన్ హబ్ పేరుతో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రత్యేక హబ్ తీసుకురావాలని నిర్ణయించామని ప్రకటించారు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్‌ల కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నామన్నారు.
పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్‌ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై సచివాలయంలో అధికారులతో చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త పాలసీతో భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
‘ఉద్యోగ కల్పన ప్రథమ లక్ష్యం’ అనేదే ప్రభుత్వ విధానమని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు మార్గం సుగమం చేసేలా పాలసీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర మార్పులతో 7-8 శాఖల్లో కొత్త పాలసీలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని అన్నారు.
పారిశ్రామిక అభివృద్ధి నూతన పాలసీ, ఎంఎస్‌ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చకు తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. పాలసీలు అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడిదారులకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా డ్రాఫ్ట్ పాలసీలో ప్రతిపాదనలు చేశామన్నారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అదనంగా 10శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీ ఉండనుందని పేర్కొన్నారు. ‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామిక వేత్త’ అనే కాన్సెప్ట్‌తో ఎంఎస్‌ఎంఈ పాలసీ ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో హబ్‌కు అనుబంధ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సెంటర్‌కు ఒక్కో మల్టీనేషనల్ కంపెనీ మెంటార్‌గా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆక్వా, పౌల్ట్రీ రంగంలో వచ్చిన విధంగా ఫుడ్ ప్రాసెసింగ్‌లోనూ ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు అవసరమైన విధానాలపై చర్చించారు. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెంటివ్ వచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీపైనా చర్చించారు. మరింత కసరత్తు తరువాత కేబినెట్ ముందుకు ఈ పాలసీ రానుంది.
కొత్త పాలసీలపై అధికారులు 3 నెలలుగా సమగ్ర కసరత్తు చేశారు. ముఖ్యమంత్రి సూచనలు, పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు, ఇతర రాష్ట్రాల విధానాల ఆధారంగా వివిధ డ్రాఫ్ట్ పాలసీలు రూపొందించారు. ప్రతి పాలసీ తయారీలో తన అనుభవాలు, ఆలోచనలు పంచుకున్న ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఏపీ పారిశ్రామిక విధానం అత్యుత్తమంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.