Monday, November 18, 2024

AP – క్రీడాకారుల‌కు శుభ‌వార్త – స్పోర్ట్స్ కోటా రిజ‌ర్వేష‌న్ పెంచిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – నూతన క్రీడా పాలసీపై సమీక్ష సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు క్రీడాకారులకు తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంచుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిఫాం సర్వీసెస్ లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. అంతేకాకుండా, శాప్ లో గ్రేడ్-3 కోచ్ ల నియామకాల్లో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తోన్న స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ స్పోర్ట్స్ నూతన పాలసీ ఉంటుందని సీఎం అన్నారు. అందరికీ క్రీడలు అనే కాన్సెప్టుతో రూపొందించిన పాలసీపై అధికారులతో సీఎం చర్చించారు. ఆటలు అంటే క్రికెట్ ఒక్కటే కాదని అన్ని ఆటలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఆటలను తమ గోల్ గా ఎంచుకునేవారికి ఉద్యోగ భద్రత కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని… ఎక్కువ మంది ఆ వైపు ప్రయాణం చేస్తారని తెలిపారు.

- Advertisement -

రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ తో కూడిన పాలసీని సిద్ధం చేశారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టం, గ్లోబల్ విజిబిలిటీ అనే అంశాల ప్రాతిపదికగా పాలసీని రూపొందించారు. ఈ నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ లో అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, క్రీడాకారులకు మద్దతు, ఉద్యోగ భద్రత, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, క్రీడా సంఘాలతో సమన్వయం, టెక్నాలజీ వాడకం, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్స్ట్ టూరిజం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీల కంటే మెరుగైన అంశాలను చేర్చారు. గ్రామ స్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి అవసరమైన ప్రణాళికను పొందుపరిచారు.

వాటర్ గేమ్స్ స్థలాన్ని తిరిగి శాప్ కు ఇవ్వండి : శాప్ ఛైర్మన్ రవినాయుడు అభ్యర్ధన

విశాఖపట్నంలో 2002లో వాటర్ గేమ్స్ కోసం కేటాయించిన ఎకరా స్థలాన్ని మాజీ సీఎం జగన్ రుషికొండ ప్యాలెస్ కు హెలిప్యాడ్ కోసం తీసుకున్నారని, తిరిగి ఆ స్థలాన్ని శాప్ కు కేటాయించాలని సీఎంను శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు కోరారు. ఎటువంటి జీవో, శాప్ కు సమాచారం లేకుండా శాప్ స్థలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం జరిగిన క్రీడా సమీక్షలో రవి నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా శాఖలో చేపట్టాల్సిన పలు అంశాలను సీఎంకు వివరించారు. విద్యాధరపురంలో 2018లో రూ.60 కోట్ల అంచనాతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని తలపెట్టగా, టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న అక్కసుతో దాన్ని కూడా గత ప్రభుత్వం రద్దు చేసిందని సీఎంకు వివరించారు. విశాఖలోని స్థలాన్ని శాప్ కు తిరిగి అప్పగించేలా ఆదేశాలివ్వాలని, విద్యాధరపురంలో ఇండోర్ స్టేడయం నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాలని సీఎంను రవి నాయుడు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement