Monday, September 16, 2024

AP – తక్షణ సాయం అందేలా చూస్తాం – కేంద్ర బృందం హామీ..

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో భేటీ
అధికారులతో సమావేశం.. పరిస్థితుల సమీక్ష
బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల పరిశీలన
పరిస్థితులు, నష్టాలపై స్పష్టమైన అంచనాలు
కేంద్రానికి నివేదించి సాయం అందేలా చూస్తాం
చర్యలు తీసుకుంటామని తెలిపిన కేంద్ర బృందం

ఆంధ్రప్రభ స్మార్ట్​, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో:

కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఏపీలో పర్యటించింది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో సంభవించిన పరిస్థితులను, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించింది. తొలుత కేంద్ర బృందం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించింది.

- Advertisement -

ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో సంభవించిన పరిస్థితులను, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సహాయ పునరావాస చర్యలను రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ (ఈఎన్‌సీ) వెంకటేశ్వరరావు వారికి వివరించారు. అనంతరం.. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను, ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను కేంద్ర బృందం పరిశీలించింది. తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్‌ – కవులూరు వద్ద బుడమేరుకు పడిన గండ్లను, గండ్లను పూడ్చే పనులను కేంద్ర బృందం పరిశీలించింది.

రామ‌వ‌ర‌ప్పాడు రింగ్‌రోడ్డు.. ముంపు ప్రాంతాల ప‌రిశీల‌న‌..

భారీ వర్షాలు, వరదల ధాటికి నీట మునిగిన రామవరప్పాడు రింగ్ రోడ్డుతో పాటు కండ్రిక, పైపుల రోడ్డు, విశాలాంధ్ర కాలనీ, రాధా నగర్, పాత రాజీవ్ నగర్, కట్టరోడ్, సుందరయ్య నగర్, వడ్డెర కాలనీ, అంబాపురం 16వ లైన్, అజిత్ సింగ్ నగర్, ప్రకాష్ నగర్, ఎల్.బి.ఎస్. నగర్, న్యూ అజిత్ సింగ్ నగర్, పాయకపురం చేపల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ట్రాక్టర్‌పై కేంద్ర బృందం ప్రయాణించింది.

నీట మునిగిన కాల‌నీల ప‌రిశీల‌న‌..

వరదల‌తో నీట మునిగిన కాలనీలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను కేంద్ర బృందం స్వయంగా పరిశీలించింది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించిన‌ రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్.పి. సిసోడియా కేంద్ర బృందం వెంట ట్రాక్టర్ పై ప్రయాణించి వారికి ముంపు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ సహాయక చర్యలను స్వయంగా వివరించారు. కేంద్ర బృందం వెంట వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement