మచిలీపట్నం – ఫుడ్ కార్పోరేషన్ గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన ఘటనలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణాజిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ అసిస్టెంట్ మేనేజన్ కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు బందరు తాలుక పోలీస్ స్టేషన్‌లో పేర్ని జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాలలోకి వెళితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బందరు మండలం పొట్లపాలెంలో తన సతీమణి జయసుధ పేరిట పేర్నినాని గోడౌన్‌ను నిర్మించారు. దీనిని పౌర సరఫరాల శాఖకు బఫర్ గోడౌన్‌గా ఆయన అద్దెకు ఇచ్చారు. అయితే వార్షిక తనిఖీల్లో భాగంగా పది రోజుల క్రితం ఈ గోడౌన్‌ను పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా గోడౌన్‌లో నిల్వ ఉన్న సరుకులో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు ఈ సందర్భంగా గుర్తించారు. ఆ క్రమంలో 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్టు పౌరసరఫరాల ఉన్నతాధికారులు గమనించారు. ఇదే విషయాన్ని పోలీసులకు చేసిన ఫిర్యాదులో కోటిరెడ్డి స్పష్టం చేశారు. అలాగే పేర్ని నాని సతీమణి జయసుధతోపాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై సైతం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ వ్యవహారంపై పేర్ని నానితోపాటు ఆయన భార్య స్పందించారు. వేబ్రిడ్జ్ సరిగ్గా పని చేయక పోవడం వల్లే సరుకు నిల్వలో షార్టేజ్ వచ్చిందని పౌర సరఫరాల ఉన్నతాధికారులకు పేర్ని నాని సతీమణి జయసుధ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె లేఖ రాశారు. షార్టేజ్ అయిన ధాన్యానికి తగిన పరిహారం చెల్లిస్తామని కూడా ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.