Thursday, November 14, 2024

AP – “కడా” కు కేబినెట్ ఆమోదముద్ర – ఇక కుప్పంలో అభివృద్ధి పరుగులు

కుప్పం, ఆంధ్రప్రభ (రాయలసీమ బ్యూరో) : గత అయిదేళ్లుగా నిద్రవస్థ లో ఉన్న కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ ( కడా) మళ్ళీ పునరుద్దరణ కు నోచుకోనున్నది. ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అందుకు అవసరమైన ఆమోదముద్ర వేయడంతో మళ్ళీ కడా నేతృత్వంలో కుప్పం అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి.

కుప్పం శాసనసభ నియోజకవర్గానికి ప్రతినిద్యం వహిస్తున్న చంద్రబాబు 2014 లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత కుప్పం ప్రాంత సమగ్రభివృద్ధి కి చేపట్టిన చర్యల్లో భాగంగా కడా ఆవిర్భావం జరిగింది. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో జరిగే పనులకు కడా సారద్యం వహించేది. ఒక ఐ ఏ ఎస్ అధికారి ప్రాజెక్ట్ అధికారిగా వ్యవహరిస్తూ కడా పాలన సాగించే వారు. అయితే చిత్తూరు జిల్లా కలెక్టర్ అధ్యక్షత న పనిచేసే కడా పీడీ నేరుగా ఆయనకే రిపోర్టు చేసేవారు.

కుప్పం ప్రాంతంలోని 17 విభాగాల అధికారులు, సిబ్బంది ప్రాజెక్ట్ డైరెక్టర్ పరిపాలనా నియంత్రణలో పనిచేసే విధంగా కడా వ్యవస్థ నిర్మాణం జరిగింది. సుధీర్ఘ కాలం తరువాత 2019 లో వై ఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక కడా నామమాత్ర వ్యవస్థ గా మారింది. ఇటు కుప్పం మున్సిపాలిటీ, అటు కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కావడంతో కడా పనితీరు మారిపోయింది.

- Advertisement -

అప్పటివరకు కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్న ఐ ఏ ఎస్ అధికారి స్థానంలో కింది స్థాయి అధికారి మిగిలారు. ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కడా పునరుద్దరణ పనులు మొదలయ్యాయి. కడా పునరుద్దరణ కు అనుకూలంగా గత జులై 9 వ తేదీన జీ ఓ నెం 58 జారీ అయింది.

కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నెల్లూరు జిల్లా మునిసిపల్ కమిషనర్ గా ఉన్న ఐ ఏ ఎస్ అధికారి వికాస్ నియమితులయ్యారు. గత పర్యటన లో చంద్రబాబు స్వయంగా కడా పునరుద్దరణ చర్యలకు అవసరమైన మౌలిక ఆదేశాలు జారీ చేసారు. ఈరోజు చంద్రబాబు నేతృత్వంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కడా కు ఒకప్పటి సాధికార సంస్థ గా పునరుద్దరిస్తూ తీర్మానం చేసింది. దీంతో కుప్పం పరిధిలోని నాలుగు మండలాలు, కుప్పం మున్సిపాలిటీ ప్రాంతాలను కడా ద్వారా అభివృద్ధి చేయడానికి ఆమోదముద్ర లభించింది.

ఇక అయిదేళ్ల క్రితం లాగే కడా పనిచేయనున్నదని స్పష్టం అవుతోంది. తాజా పరిణామాలతో అదనపు పీడీ, తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌, సహాయక సిబ్బంది సహా 19 మంది సిబ్బంది పోస్టులను మంజూరు కానున్నాయి.

. కడా కార్యకలాపాలకు మద్దతుగా ఆర్థిక శాఖ ద్వారా ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు, ప్రత్యేక హెడ్ ఆఫ్ అకౌంట్ ఏర్పాటు కానున్నదని తెలుస్తోంది. మొత్తం మీద ప్రభుత్వ తాజా నిర్ణయంతో మళ్ళీ కుప్పంలో కడా పాలన ఊపందుకొనున్నది..

Advertisement

తాజా వార్తలు

Advertisement