మద్యం పాలసీ ఇక.. సరికొత్తగా
ఏపీలో అమలుకు సన్నాహాలు
కేబినెట్ భేటీలో చర్చ
ఆమోదించిన మంత్రి మండలి
జే బ్రాండ్స్ అమ్మకాలపైనా చర్చ
నాటుసారా అమ్మకాలపై ఉక్కుపాదం
వరద బాధితులకు సాయంపై ప్రకటన
సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ : నూతన మద్యం పాలసీని ఏపీ మంత్రి మండలి ఆమోదించింది. అమరావతిలోని సచివాలయంలో బుధవారం ఏపీ మంత్రిమండలి భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మండలి సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సారి భేటీలో మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన మద్యం పాలసీపై సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో జే బ్రాండ్స్ మద్మం అమ్మాకలపై చర్చ జరిగింది.
నాటుసారాపై ఉక్కుపాదం..
నాసిరకం మద్యం అమ్మకాలను అడ్డుకోవాలని, నాటు సారా వ్యాపారం పెరిగిపోయిందని మంత్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి తీసుకొచ్చిన మద్యం పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆపరేషన్ బుడమేరు అంశంపై కూడా కేబినెట్ చర్చించింది. ఇలాంటి విపత్తులు మరోసారి ఎదురుకాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు చర్చించారు. దీని కోసం కార్యచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. మరోవైపు వరదలు వచ్చినప్పుడు కేంద్రం చేసిన సాయానికి మంత్రి మండలి కృతజ్ఞత తెలిపింది.
వరద బాధితులను ఆదుకుంటాం..
వరద నష్టంపై కూడా అదే స్థాయిలో ఆదుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ మంత్రిత్వ శాఖల నివేదికల అంశం కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇవి కాకుండా పారిశ్రామిక అభివృద్ధి, విద్యుత్ సంస్కరణలపై కూడా మంత్రిమండలి సమాలోచనలు జరుపుతోంది. వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రుల గ్రాఫ్, ఎమ్మెల్యేల పని తీరు ఇలా అన్నింటిపై కూలంకుశంగా మాట్లాడుకున్నారు. జనసేన మంత్రుల గ్రాఫ్‌ను చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అందజేశారు.
మరోవైపు.. వచ్చే దీపావళి నాటికి మహిళలకు కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగింది.. ఉచిత వంట గ్యాస్ అందిద్దామా..? లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా..? అనే అంశంపై మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను ఇచ్చే పథకం వైపే మెజార్టీ మంత్రుల మొగ్గు చూపారట.. ఇక, బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సీఎం చంద్రబాబు.. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేశారు.. బీసీలకు రిజర్వేషన్లపై కేంద్రానికి సిఫార్సు చేసింది ఏపీ కేబినెట్.. దీంతో.. బీసీలకు రిజర్వేషన్ల తీర్మానంపై చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సవిత..
ఇక, వాలంటీర్ల వ్యవస్థ పునరుద్దరణపై కేబినెట్‌లో చర్చ జరిగింది.. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసిందని తెలిపారు అధికారులు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా నాడు వాలంటీర్లతో వైఎస్ జగన్ రాజీనామా చేయించారని పలువురు మంత్రులు గుర్తుచేశారు.. తప్పుడు విధానాలు.. దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన సాగించారని విమర్శించారు.. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ..
విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. . గత ప్రభుత్వంలో సాక్షి పత్రిక కొనుగోళ్ల పేరిట జరిగిన అవకతవకలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. రెండేళ్లలోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.205 కోట్లు ఖర్చు చేశారని మంత్రులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు సీఎం ఆదేశించారు. వాలంటీర్లు, సచివాలయాలకు దిన పత్రికల కొనుగోలుకు నెలనెలా ఇచ్చే రూ.200 రద్దు చేశారు.