ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈనెలలో చేపట్టే సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపైనా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. సుమారు 50 అంశాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది.
ఇప్పటికే విడుదల చేసిన యూనివర్శిటీ అధ్యాపకుల పోస్టుల భర్తీతో పాటు గ్రూప్ – 1, గ్రూప్ – 2, ఇతర పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటిల్లో 900 వరకు గ్రూప్–2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్–1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేస్తారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్‌లో సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు.
స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మరో రూ.19,037 కోట్ల విలువైన 10 పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో ఏడు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు కాగా.. మూడు విస్తరణ కార్యక్రమాలకు చెందినవి ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 69,565 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.