Friday, November 22, 2024

AP … Bumper Offer – లంచాసురుల స‌మాచారం ఇవ్వండి… బ‌హుమ‌తిగా న‌గ‌దు ప‌ట్టుకుపోండి..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో లంచం అనే పదం వినపడకూడదు.. అవినీతి రహిత రాష్ట్ట్ట్రం మన లక్ష్యం.. అంటూ సీఎం జగన్‌ పదే పదే అధికారులకు ఆదేశాలిస్తున్నారు. ఇందుకోసం ప్రజల్లో అవగాహన తీసుకురావాలని, బాధితుల్లో చైతన్యం పెంచాలని, అవినీతిపై ఉక్కుపాదం చర్యల్లో భాగంగా విస్తృత ప్రచారం కల్పించాలని సీఎం సూచించారు. దీంతో ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడరాదని ప్రభుత్వ ఆదేశాలతో అవినీతి నిరోధక శాఖ కొరఢా ఝలిపిస్తోంది. దీంతో కొంతమంది అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఈనేపధ్యంలో అక్రమార్జన, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడం, పని చేయాలంటే లంచం డిమాండు చేయడం, ప్రజలను వేధించడం వంటి అక్రమాలను అరికట్టేందుకు ఏసీబి ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతోంది. ఇందుకోసం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ఏసీబి ప్రజల నుంచి సమాచారం, బాధితుల నుంచి ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్‌ 14400తోపాటు, ప్రత్యేక యాప్‌ను ఏర్పాటు చేసింది. దీంతో క్రమేణా వీటికి ప్రజల నుంచి ఫిర్యాదులు, సమాచారం సంఖ్య పెరుగుతోంది. దీంతో మరింత విస్తృత పరిచేందుకు ఏసీబి ప్రజలకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది. సమాచారం తెలిపిన వారికి, ఫిర్యాదు చేసిన వారికి నజరానా ప్రకటించింది. దీనిలో భాగంగా ఏసీబీ అవినీతి నిరోధక శాఖ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 14400 కి ఫిర్యాదు చేసిన వారికి రూ. 5-10 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే కేవలం ఫిర్యాదు చేస్తామంటే కుదరదు. సరైన ఆధారాలు తెలియచేయాల్సి ఉంటుంది. అలా అక్రమార్జన గురించి పక్కా ఆధారాలతో సమాచారం ఇచ్చి పట్టించిన వారికి 10వేల వరకు నజరానా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే దీన్ని అధికారికంగానే ప్రోత్సాహకంగా పరిగణించడం జరుగుతుంది. సబ్‌ రిజిస్ట్రార్‌, రెవిన్యూ, కలెక్టరేట్‌, ఆర్డీఓ, విద్యుత్‌ శాఖ కార్యాలయాలు, ఎంపీడీఓ, ఎమ్మార్వో ఆఫీసులు, పోలీసుశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రులు ఇలా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాల్లోని లంచగొండులు, ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వారిపై సమాచారం పక్కాగా ఉండాలి. టోల్‌ ఫ్రీ 14400కి ఫోన్‌ చేసినా, అర్జీ రూపంలో ఫిర్యాదు చేసినా ఏసీబి తక్షణం స్పందిస్తుంది.

వివరాలు అత్యంత గోప్యం..
అవినీతి అధికారులు, సిబ్బందికి సంబంధించిన సమాచారం తెలిపిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏసీబి భరోసా ఇస్తోంది. బాధితులు, ఇన్‌ఫార్మర్లకు వచ్చిన భయమేమీ లేదని, వారి రక్షణ బాధ్యత ఏసీబి చూసుకుంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఒకసారి ఫిర్యాదు చేస్తే ఇక వారు టార్గెట్‌ అవుతారనే అనుమానం అక్కరలేదని, ప్రత్యర్ధులు తమపై కక్ష పెంచుకుంటారన్న భయం అసలే అవసరం లేదని అంటున్నారు. ఫిర్యాదు చేసినందుకు, సమాచారం ఇచ్చినందుకు తమ పనులు ముందు ముందు కాకుండా పోతాయన్న అనుమానం వద్దంటున్నారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలు బయట పెట్టకుండా గోప్యంగా ఉంచుతూనే సమస్య పరిష్కారం జరుగుతుందని, అదేవిధంగా ఆరోపణల ఎదుర్కొంటున్న వారిపై చర్యలుంటాయని స్పష్టం చేస్తున్నారు. యాప్‌, టోల్‌ఫ్రీకి వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం గ్రామాలు, సచివాలయాలు, రెవిన్యూకు సంబంధించి ఉంటున్నాయి, వీరిలో రైతులు, కూలిపనులు చేసుకునే వారు ఉంటున్నారు. పట్టాదారు పాస్‌ బుక్‌లు, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు-, కుల, ఆదాయ, జనన – మరణ ధ్రువీకరణ పత్రాలు, విద్యుత్‌ కనెక్షన్‌లు, రిజిస్ట్రేషన్‌లు వంటి వాటి కోసం అర్జీ దారులు లంచం సమర్పించుకునే పరిస్ధితి ఉంది. ఇలాంటివన్నీ సచివాలయాల్లో నామమాత్రపు రుసుముతో సేవలు అందించాల్సి ఉన్నా అక్కడ ఉండే కొంతమంది సిబ్బంది, అధికారులకు లంచం ఇస్తే గాని పని కావడం లేదు.

- Advertisement -

అడ్డంగా దొరికిపోయిన ఆర్‌ఐ..
బాధితుల్లో పెరిగిన చైతన్యానికి తాజా ఘటన నిదర్శనంగా నిలిచింది. లంచం కోసం వేధిస్తున్న రెవిన్యూ అధికారిణిపై ఏసిబి 14400 కాల్‌ సెంటర్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులతో ఏసీబి అధికారులు విసిరిన వలలో సదరు అధికారిణి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బోయిన సాయి కిరణ్‌ తన అమ్మ, పిన్నికి సంబంధించిన భూమికి పట్టాదారు పాసుపుస్తకం కోసం మండవల్లి మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ కందుల పద్మ రోజాను సంప్రదించాడు. దీంతో ఆమె రూ.38 వేలు లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అధికారులు శుక్రవారం వలపన్ని ఫిర్యాది వద్ద నుంచి రూ.38వేలు లంచం తీసుకుంటున్న మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ కందుల పద్మరోజాను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అరెస్టు చేసి నిందితురాలిని కోరుటలో హాజరుపరుస్తామని ఏసీబి అధికారులు ప్రకటించారు.

ధైర్యంగా ఫిర్యాదు చేయండి : డీజీపీ
ఫిర్యాదు ఏరూపంలో చేసినా వాటిని పరిష్కరిస్తామని, ప్రజలు నమ్మకంతో సమాచారం ఇవ్వాలని, బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని డీజీపీ కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేకంగా అందుబాటు-లో ఉంచిన 14400 నెంబర్‌ను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement