Tuesday, November 26, 2024

14 నుంచి ఎపి అసెంబ్లీ స‌మావేశాలు … మూడు రాజ‌ధానుల బిల్లుకు అవ‌కాశం..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు శుక్రవారం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏపీలో వైకాపా ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకోబోతోంది. అలాగే మరో రెండు నెలల్లో ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించబోతోంది. ఎన్నికల ఏడాది పూర్తిస్ధాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉండదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కీలకంగా మారాయి. ఈ ప్రభుత్వానికీ ఇవే చివరి బడ్జెట్‌ సమావేశాలు కానున్నాయి. 14వ తేదీన గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్‌ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం
జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పని రోజులు నిర్ణయిస్తారు. కనీసం పది రోజుల పాటు- సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు- చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే వివిధ శాఖల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకున్న ప్రభుత్వం.. వాటితో బడ్జెట్‌ పద్దు సిద్దం చేస్తోంది. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాలకు వైకాప ప్రభుత్వం పెద్ద పీట వేసే అవకాశం ఉంటు-ందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులోనే మూడు రాజధానుల బిల్లును మరోసారి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. బడ్జెట్‌ తో పాటు- పలు కీలక బిల్లుల్ని ఆమోదింపచేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు- చేసుకుంటోంది.

పది రోజులు బడ్జెట్‌ సమావేశాలు..
మార్చి 14న ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కనీసం 10 రోజులు జరిగేలా కనిపిస్తున్నాయి. తొలిరోజు గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభమయ్యే సెషన్స్‌.. రెండో రోజు బీఏసీ సమావేశం తర్వాత అజెండా ఖరారు చేసుకుంటాయి. అనంతరం అజెండా ఆధారంగా బడ్జెట్‌ ఎప్పుడు ప్రవేశపెట్టబోతున్నారనేది తేలిపోనుంది. అనంతరం మరికొన్ని కీలక అంశాలపై ప్రభుత్వం దృష్టిసారించవచ్చని తెలుస్తోంది. ఎన్నికల బడ్జెట్‌ గా భావిస్తున్న ఇందులో జగన్‌ సర్కార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్‌సమ్మిట్‌ లో త్వరలో విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామని కీలక ప్రకటన చేయడంతో రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు మరో మారు అసెంబ్లీ ముందుకు రానున్నట్లు- తెలుస్తోంది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు- కోసం రెండు బిల్లుల్ని అసెంబ్లీలో గతంలో ఆమోదించిన ప్రభుత్వం అనంతరం గవర్నర్‌తోనూ ఆమోదముద్ర వేయించుకున్నా న్యాయస్దానాల్లో చుక్కెదురైంది. ఈ విషయం ముందే గ్రహించి బిల్లుల్ని వెనక్కి తీసుకుంది. వాటి స్దానంలో మరింత మెరుగైన బిల్లు తీసుకొస్తామని అప్పట్లో సీఎం జగన్‌ సభాముఖంగా ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు- ప్రచారం జరుగుతోంది. అయితే సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో అసెంబ్లీలో మరోసారి బిల్లు పెట్టడంపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటు-న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement