అంగీకారం తెలిపిన బీపీసీఎల్ కంపెనీ
విజయం సాధించిన సీఎం చంద్రబాబు
కూటమి ప్రభుత్వం చొరవతోనే బీపీసీఎల్ రాక
పోటీకి వచ్చిన ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు
అయినా కాదని ఏపీకే వస్తున్న అతిపెద్ద కంపెనీ
ఢిల్లీవెళ్లి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపిన సీఎం
బీపీసీఎల్ ప్రతినిధులతోనూ పలుమార్లు భేటీ
ఏపీకి వచ్చి పరిస్థితులు అంచనా వేసిన ప్రతినిధుల బృందం
పెట్టుబడులకు సానుకూలంగా స్పందించిన కంపెనీ
మచిలీపట్నం ఏరియాలో భూ కేటాయింపులకు ప్రభుత్వం రెడీ
ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు తీరంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ₹ 6100 కోట్లతో చేపట్టనున్నారు. ప్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలతో పాటు ఇతర అధ్యయనాలు, భూమి గుర్తించడం, భూ సేకరణ, సవివరమైన సాధ్యాసాధ్యాల నివేదిక తయారీ, పర్యావరణ ప్రభావ అంచనా, ప్రాథమిక డిజైన్ ఇంజనీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్ మొదలైనవి చేపడతారని బీపీసీఎల్ వివరించింది.
పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు సక్సెస్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు విజయం సాధించారు. బీజేపీ అధికారంలో ఉన్న మరో రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్ రిఫైనరీ దక్కించుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాయి. బీపీసీఎల్ ఈ ప్రాజెక్టులో సుమారు ₹50,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని ప్రచారం జరిగినా ప్రాథమికంగా ₹6100కోట్ల పెట్టుబడులకు అమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు వేర్వేరు ప్రాంతాల్లో రిఫైనరీల ఏర్పాటు కోసం పోటీ పడ్డాయి. బీపీసీఎల్ సీఎండీ జి కృష్ణ కుమార్ నేతృత్వంలోని బీపీసీఎల్ ఉన్నతాధికారులు గత జులైలో అమరావతిలో సీఎం చంద్రబాబుతో సమావేశమై ప్రతిపాదనపై ప్రాథమిక చర్చలు జరిపారు.
కేంద్ర పెద్దలతోనూ మంతనాలు..
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక మిత్రపక్షంగా ఉంది. మరో ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ, హెచ్‌పీసీఎల్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తోంది. హెచ్‌పీసీఎల్ వైజాగ్ రిఫైనరీ, 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో, ప్రస్తుతం 15 ఎంఎంటీపీఏకి చేరుకోవడానికి విస్తరణలో ఉంది. గత జూన్‌లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కాగా, బీపీసీఎల్ ఏపీలో మొదటి మెగా పెట్టుబడి కానుంది.
భూ కేటాయింపులకు ఓకే..
గత జూన్ లో జరిగిన చర్చల్లో, రిఫైనరీ ఏర్పాటుకు కనీసం 4,000 నుండి 5,000 ఎకరాల భూమి అవసరమని బీపీసీఎల్ బృందం సీఎం చంద్రబాబుకు సూచించింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వర్గాల సమాచారం ప్రకారం రిఫైనరీ స్థాపన కోసం మచిలీపట్నంలో బీపీసీఎల్‌కు కావాల్సినంత భూమి అందించవచ్చు. ఇక్కడ పోర్టు నిర్మాణం కూడా జరుగుతోంది. ప్రస్తుతం, బీపీసీఎల్ ముంబయి, కొచ్చి, మధ్యప్రదేశ్‌లోని బినాలో మూడు రిఫైనరీలను నిర్వహిస్తోంది, వార్షిక శుద్ధి సామర్థ్యం దాదాపు 36 ఎంఎంటీపీఏతో ఉంటుంది. కొత్త ప్రతిపాదిత రిఫైనరీ 12 ఎంఎంటీపీఏతో సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
6100 కోట్ల పెట్టుబడులకు సన్నద్ధం..
ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు ఏపీలో బీపీసీఎల్ పెట్టుబడులపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో చర్చించారు. అంతేకాకుండా బీపీసీఎల్ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపారు. 90 రోజుల్లోగా కంపెనీకి అవసరమైన భూమిని కేటాయిస్తామని ఆ సంస్థ బృందానికి చెప్పానని, ప్రాజెక్ట్ స్థాపనకు అవసరమైన వివరణాత్మక, అవసరమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని కంపెనీ ప్రతినిధులను కోరినట్లు సీఎం గతంలో చెప్పారు. సాధ్యాసాధ్యాల నివేదికతో అక్టోబర్ నాటికి తిరిగి వస్తామని అప్పట్లో బీపీసీఎల్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తాజాగా ₹6100కోట్ల పెట్టుబడులు పెట్టనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించినట్టైంది.