Wednesday, November 20, 2024

ఎపి బిజెపిలో క‌ల‌క‌లం..

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీ బీజేపీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర పార్టీ అమరావతి రాజధాని అంటూ స్పష్టమైన వైఖరి తీసుకున్న నేపధ్యంలో విశాఖ రాజధాని అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీ యాంశంగా మారాయి. రెండు రోజుల పాటు విశాఖపట్టణంలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రెండో రోజు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కిషన్‌ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములం కావాలంటే రాజధానిలో మన ప్రతినిధి ఉండాలంటూ పరోక్షంగా ఏపీ రాజధాని విశాఖ అనే ధోరణిలో మాట్లాడారు. ఆ వెనువెంటనే సర్థుకొని రాజధాని కేంద్రంలో కావొచ్చు..జిల్లా ప్రధాన కేంద్రంలో కావొచ్చంటూ సర్థుబాటు ధోరణిలో మాట్లాడినప్పటికీ కిషన్‌ రెడ్డి విశాఖ రాజధానికి అనుకూలమనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చిన తర్వాత అమరావతి ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. ప్రతిపక్ష తెదేపా, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు సైతం అమరావతి రాజధానికే తమ మద్దతు అంటూ చెప్పుకొచ్చారు. వైసీపీ మినహా కొన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతుగా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటే.. మరికొన్ని పార్టీలు ఆందోళనలో పాల్గొనకున్నా బాహాటంగానే మద్దతు పలికాయి. ఇందులో ఏపీ బీజేపీ కూడా కీలకంగా వ్యవహరించింది. అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వడంతో పాటు అక్కడి రైతులకు మద్దతుగా ఆందోళనలు కూడా చేసింది. ఇలాంటి తరుణంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీని అంతర్మథనంలోకి నెట్టాయి.


తొలి నుంచే అమరావతి స్టాండే..
తొలి నుంచి కూడా ఏపీ బీజేపీ రాష్ట్ర రాజధాని అమరావతి మాత్రమేనని చెపుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పలు సందర్భాల్లో అమరావతి రాజధాని కాబట్టే చుట్టుపక్కల పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిందంటూ చెప్పారు. రూ.10వేల కోట్లు రాజధాని అభివృద్ధికి కేంద్రం ఇచ్చిందని చెపుతూ రాజధాని ప్రాంతాన్ని స్మార్టు సిటీల జాబితాలో కూడా చేర్చిన అంశాన్ని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. మరో కీలక నేత, పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు సైతం వివిధ సందర్భాల్లో ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. గత ఏడాది రాజధానికి మద్దతుగా గుంటూరు జిల్లా బీజేపీ నిర్వహించిన పాదయాత్రలో సైతం సోము వీర్రాజు, ఇతర కీలక నేతలు పాల్గొని అమరావతే రాజధాని అంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. అంతకు ముందు రాష్ట్ర కార్యవర్గంలో అమరావతి రాజధానిగా తీర్మానించడంతో పాటు తిరుపతి నుంచి అమరావతి రైతులు నిర్వహించిన పాదయాత్రలో బీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో కలకలం రేపుతున్నాయి.


అంతర్మథనం..
కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు అంతర్మథనం చెందుతున్నారు. ఇప్పుడా అంశం నుంచి ఏ విధంగా బయటపడాలనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలను ఖండించాలా? లేదా? అనే దానిపై కూడా మీమాంస నెలకొంది. కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమా? పార్టీ పరమైనవా? అనే అంశం చెప్పేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు. పార్టీ వేదికపై మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా అది పార్టీ స్టాండ్‌గానే ప్రజలు భావించే అవకాశం ఉంది. రాష్ట్ర పార్టీ ఇప్పటికే అమరావతి రాజధాని అంటూ చెపుతున్న తరుణంలో కేంద్ర బీజేపీ పెద్దలు మరో స్టేట్‌మెంట్‌ ఇవ్వడమంటే పార్టీపై ప్రజల్లో సందేహాలు రేకెత్తించడమేనని భావిస్తున్నారు. పైగా రాజధాని అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. ఇటీవల కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో విభజన చట్టం ప్రకారమే అమరావతి రాజధాని ఏర్పడిందని, అందుకు నిధులు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. ఇలాంటి తరుణంలో కీలక మంత్రి హోదాలో కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఎటు దారితీస్తాయోననే సందేహాలు పార్టీ నేతల్లో నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement