శ్రీ సత్యసాయి బ్యూరో నవంబర్ 06: (ప్రభన్యూస్) – రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడంతోనే తాను వైకాపా విధానాలపైన మాట్లాడడం జరుగుతోందని పురందేశ్వరి తెలిపారు. అంత మాత్రాన తాను టిడిపికి కోవర్టుగా ఎలా అవుతానని ఆమె ప్రశ్నించారు. సోమవారం శ్రీ సత్య సాయి జిల్లా పర్యటనలో భాగంగా పురందేశ్వరి పుట్టపర్తి జిల్లా కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె పై విధంగా స్పందించారు. తాను రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం రాష్ట్రంలోని జిల్లాల పర్యటన చేయాలనే ఆలోచనలో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లాకు విచ్చేయడం జరిగిందన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా అంటేనే నందమూరి వంశానికి ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. ముఖ్యంగా తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావును ఈ జిల్లా ప్రజలు చాలా ప్రేమించారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒకరకంగా తాను శ్రీ సత్యసాయి జిల్లాలోకి రాగానే తన తండ్రి ఎన్టీ రామారావు ఆశీర్వాదం తనకు లభించినట్లుగా భావిస్తున్నానన్నారు. నందమూరి వంశం జిల్లా ప్రజలకు రుణపడి ఉన్నాదని ఆమె అన్నారు. కాగా రాష్ట్రం విడిపోయిన అనంతరం కొత్త రాష్ట్రంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తూ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోడీ నాయకత్వ ప్రభుత్వం హితోదికంగా రాష్ట్రానికి నిధులు ఇవ్వడం జరుగుతోందన్నారు.
ముఖ్యంగా పాతిక లక్షల పక్కా గృహాలను మంజూరు చేయగా గత ప్రభుత్వం కేవలం 3 ఇళ్లను మాత్రమే నిర్మించింది.ఈ ప్రభుత్వం ఏ మేరకు ఇళ్లను నిర్మించిందో ప్రజలే చెప్పాలన్నారు. ఇదే సందర్భంలో శ్రీ సత్య సాయి జిల్లాలోని హిందూపురం పట్టణం లో సుమారు 2.50 లక్షల మంది జనాభాగా ఉండగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద 195 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. పెనుకొండ వద్ద గల గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్లైన్ల ద్వారా హిందూపురం కు తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వమే ముందుకు వచ్చిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే సందర్భంలో జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇందులో 42 జాతీయ రహదారికి రూ.600 కోట్లు ఇచ్చి ధర్మవరం, కదిరి నియోజకవర్గం లో పనులు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా పెనుకొండ, మడకశిర నియోజకవర్గం కొడికొండ చెక్పోస్ట్ నుంచి కర్ణాటకలోని శిర వరకు రోడ్డు నిర్మాణం కు నిధులు ఇవ్వడం తెలిసిందేనన్నారు. ఇంకా సర్వ శిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు, విద్యార్థినులకు ఉచిత దుస్తులు, ఉచిత బూట్లు ,పుస్తకాలు పంపిణీ చేశారని పురందేశ్వరి వివరించారు .ఇలా రాష్ట్రంలోని అన్ని విషయాలలో కూడా కేంద్ర ప్రభుత్వమే సహాయపడుతుందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటూ ఏమీ లేదు .కానీ అనేక పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడం జరిగిందని ఆమె తెలిపారు.