Tuesday, November 26, 2024

AP – ఆరు ఖాయం! క‌మలంతో సైకిల్ , గ్లాస్ ప‌య‌నం ..

బీజేపీ హైక‌మాండ్‌తో బాబు, ప‌వ‌న్ భేటీ
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో చ‌ర్చ‌లు
లోక్‌స‌భ‌కు 6, అసెంబ్లీకి 6 స్థానాల్లో పోటీ
లోక్‌స‌భ సీటు త‌గ్గించుకున్న జ‌న‌సేన‌
రెండు స్థానాల్లోనే పోటీకి సై
ఇవ్వాలో, రేపో ఫైన‌ల్ ప్ర‌క‌ట‌న ఉండే చాన్స్‌

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – కేంద్రంలో 370 మంది ఎంపీలతో మోదీ సర్కారు హ్యాట్రిక్ సాధించాలి. రికార్డు సృష్టించాలి. ఏపీలో టీడీపీ ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి రావాలి. లేకుంటే వైసీపీ పాలనలో కనీసం గోడ కుర్చీకి అవకాశం ఉండదు. అందుకే జనసేనతో జట్టుకట్టినా.. కేంద్రంలో బీజేపీ బలగమూ టీడీపీకి అత్యవసరమే. ఈ స్థితిలో బీజేపీతో పొత్తు ఖాయం చేసుకున్నా సీట్ల సర్దుబాటు వ్యవహారంలోనే బేరసారాలు కుదరక అటు టీడీపీ, ఇటు జనసేన సైతం ఉక్కిరిబిక్కిరి కాగా.. ఎట్టకేలకూ త్రిముఖ పార్టీ మధ్య సయోధ్య కుదిరింది. ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించటమే ఆలస్యం.

లెక్క కుదిరినట్టే.. ఇక ప్రకటనే

ఢిల్లీ వేదికగాబీజేపీ – టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటుచర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టే. గత రెండు రోజులుగా బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుదీర్ఘ చర్చలు.., జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వంలో కూటమి మధ్య ఒప్పందం ఓ దారికి వచ్చిందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇప్పటి వరకూ బీజేపీ 10 ఎంపీ సీట్లు కోసం పట్టుపట్టగా..ఇప్పటికే జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇచ్చిన చంద్రబాబు .బీజేపీకి 6 స్ధానాలు ఇచ్చేందుకు తలూపారు. బీజేపీ మాత్రం 10ఎంపీ సీట్ల కోసం ఒత్తిడి చేసింది. ఈ సమయంలో బిజెపికి ఆరు అసెంబ్లీ, ఆరు లోక్ స‌భ సీట్లు ఇచ్చేందుకు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే స‌మయంలో జ‌న‌సేన‌కు ఒక ఎంపి సీటుకు క‌త్తెర ప‌డింది.. ముందు మూడు లోక్ స‌భ సీట్లు కేటాయించిన టిడిపి తాజాగా రెండు సీట్లు ఇచ్చింది…

కుదిరిన స‌యోధ్య‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ–జ‌న‌సేన, బీజేపీ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. శ‌నివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ చ‌ర్చ‌లు జ‌రిపారు. టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ పొత్తుపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. అయితే.. పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్‌స‌భ స్థానాల్లో పోటీ చేయ‌నుంది. జ‌న‌సేన 2 స్థానాల్లో బ‌రిలో దిగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక మిగిలిన 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం పోటీ చేయ‌నుంది. 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తుంద‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాన్‌, చంద్ర‌బాబు క‌లిసి ప్ర‌క‌టించారు.

- Advertisement -

బీజేపీ పొత్తుతో..

తాజాగా బీజేపీతో ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసే అవ‌కాశం ఉంది. మిగిలిన 145 స్థానాల్లో టీడీపీనే బ‌రిలో దిగ‌నుంది. ఇక బీజేపీ అనకాపల్లి, నర్సాపురం, అర‌కు లేదా హిందూపురం, రాజంపేట్, రాజ‌మండ్రి, ఏలూరు లోక్ సభ స్థానాలపై దృష్టిపెట్టింది. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 370 సీట్లు కైవ‌సం చేసుకునే దిశ‌గా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌తో బీజేపీ పొత్తులు కుదుర్చుకుంటోంది .

అమిత్‌షాతో బాబు, ప‌వ‌న్ చ‌ర్చ‌లు..

బీజేపీ కీల‌క నేత అమిత్ షాతో సుమారు 50 నిమిషాల పాటు ఏపీ రాజ‌కీయాల‌పై చంద్ర‌బాబు, ప‌వ‌న్ చ‌ర్చించారు. ఈ చ‌ర్చల సంద‌ర్భంగా ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని టీడీపీ భావిస్తోంది. ఏపీ, దేశ ప్ర‌యోజ‌నాల కోసం క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

కాకినాడ బరిలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఢిల్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం అనంతరం జనసేన, బీజేపీ అభ్యర్థులు ఏయే స్థానాల్లో పోటీ చేస్తారో అంచ‌నా వ‌చ్చింది. ఇప్పుడీ వార్త సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ ఏ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారో ప్రకటించక పోవటంతో.. కాకినాడ లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తారని కొత్త జాబితాలో ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. బీజేపీ, జనసేన నుంచి ఎంపీ అభ్యర్థులుగా ఈ జాబితా సమాచారం ప్రకారం, కాకినాడ ఎంపీ స్థానంలో పవణ్ కళ్యాణ్ , మచిలీ పట్నంలో వల్లభనేని బాలశౌరి జన సేన నుంచి పోటీ చేయ‌నున్నారు. రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురందరేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, నరసాపురం నుంచి ర‌ఘురామ కృష్ణరాజు, అనకాపల్లి నుంచి సీఎం రమేశ్‌ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఇక‌…హిందూపురం లేదా అరుకు విషయంలో ఇంకా స్పష్టత రాలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement