నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీంతో పశుసంవర్ధకశాఖ అధికారులు కోళ్లకు సంబంధించిన శాంపిల్స్‌ను భోపాల్‌లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా.. బర్డ్ ఫ్లూతోనే కోళ్లు చనిపోతున్నాయని జిల్లా యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది.
మూడు నెలలు చికెన్ షాపులు బంద్
ఈ నేపథ్యంలో కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని, కిలోమీటర్ పరిధిలో ఉన్న చికెన్ షాపులు మూడు నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచించారు. అలాగే.. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ గ్రామాలలో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్ కు దూరంగా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంగించి చికెన్ షాపులు తెరిచినట్లయితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు.