Friday, November 22, 2024

బద్వేల్ బరిలో బీజేపీ.. జనసేనాని ప్రచారం చేస్తారా?

ఏపీలో బీజేపీ-జనసేన పార్టీల పొత్తు కొనసాగుతుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. బద్వేల్ ఉప ఎన్నిక ఈ రెండు పార్టీల మద్య చిచ్చు పెడుతోందని ప్రచారం జరుగుతోంది. బద్వేల్ ఉప ఎన్నిక నుంచి జనసేన తప్పుకుంది. సాంప్రదాయాలను పాటించి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. అయితే, మిత్రపక్షం బీజేపీ మాత్రం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో తిరుపతి లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపి ప్రచారం చేశారు. అయితే, ఇప్పుడు బద్వేల్ ఉపఎన్నికకు జనసేన దూరం కావడంతో.. బీజేపీ పోటీ చేస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో జనసేన, బీజేపీ బంధంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల వెల్లడైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ పార్టీల మధ్య పొత్తు పొడించింది.

ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు టీడీపీ-జనసేన పార్టీలు చేతులు కలిపాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు మండలాల్లో పరస్పర అవగాహనతో ఎంపీపీ స్థానాలు దక్కించుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం, పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఎంపీపీ పదవి దక్కించుకునేందుకు ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. ఇక, బద్వేల్ ఉపఎన్నిక నుంచి కూడా జనసేన దూరం కావడంతో బీజేపీతో బంధానికి బీటలు వారాయి అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లో వచ్చే ఎన్నికల్లో జనసేన- బీజేపీ కలిసే పోటీ చేస్తాయని…అందులో ఎలాంటి అనుమానాలు లేవని కుండ బద్దలు కొట్టారు. జనసేన పార్టీకి ఒక పాలసీ ఉంది.. తమ పార్టీకి ఒక పాలసీ ఉందని చెప్పారు. బిజెపి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించదని, అందుకే తాము బద్వేల్ లో పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

- Advertisement -

వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీజేపీలోని ఓ వర్గం భావిస్తోంది. అదే సమయంలో ఎన్నికలో పోటీ చేసి ఓడిపోవడం కంటే.. ఎన్నికకు దూరంగా ఉంటే మంచిదని మరో వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలో సోము వీర్రాజు ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఒక వేళ బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తే.. జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement