Monday, November 11, 2024

AP | వైభవంగా భవానీ దీక్షధారణ

  • 15 వరకు మండల దీక్ష స్వీకరణ…
  • భక్తితో మాలధారణ స్వీకరిస్తున్న భవానీలు…
  • ప్రత్యేక పూజల అనంతరం భవానీలకు మాలధారణ చేసిన ఈవో కేఎస్ రామారావు..
  • భవానీ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రగిరులు..
  • డిసెంబర్ 1 నుండి 5 వరకు అర్థమండలం..
  • డిసెంబర్ 21 నుండి 25 వరకు విరమణ…
  • విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు…

( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : పరమ పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో ఆచరించే భవానీ దీక్షల సేకరణ కార్యక్రమం ఎంతో వైభవంగా ప్రారంభమైంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఆట నిర్వహించే భవానీ దీక్షల స్వీకరణ మహోత్సవం సోమవారం ఆలయ మహా మండపం ఆరవ అంతస్తులో ప్రారంభించారు. సోమవారం నుండి 15వ తేదీ వరకు మండల దీక్ష దారణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముందుగా ఆలయంలో గణపతి పూజా కార్యక్రమం అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆరవ అంతస్తులోని మండపం వద్దకు తీసుకువచ్చే ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఆలయ ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో ఆలయ వైదిక కమిటీ నేతృత్వంలో భక్తిశ్రద్ధలతో శాస్త్రక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థానం తరపున ఆచార్య గురు భవానీగా వ్యవహరించగా యుద్దనపూడి నాగరాజు శాస్త్రి, యానమండ్ర ఉమాకాంత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి దీక్ష ధారణ స్వీకరించేందుకు వచ్చే భక్తులకు దీక్షాధారణను నిర్వహించారు. దీక్షాధారణ స్వీకరించిన భక్తులందరికీ అమ్మవారి నామాలతో నియమాలతో కూడిన భవానీ దీక్ష కరపత్రాలతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన శ్రీనిధి లలితా సహస్రనామ పుస్తకాలను ఆలయ ఈవో కేస్ రామారావు స్వయంగా పంపిణీ చేశారు. అమ్మవారి మండల దీక్ష ధారణ స్వీకరించేందుకు వచ్చిన భవానీలు జై భవానీ, జై జై దుర్గా భవానీ అంటూ నామస్మరణతో ఇంద్రగిరలు ప్రతిధ్వనిస్తున్నాయి.


భవానీ దీక్షలు ఇలా…

కనకదుర్గమ్మ భవానీ దీక్షలు స్వీకరించే భక్తుల కోసం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం నుండి ప్రారంభమైన దీక్షా స్వీకరణలో భాగంగా దీక్షా స్వీకరించే భక్తులకు ఆలయ పూజారులతో పాటు గురు భవానీలు అందుబాటులో ఉంటూ దీక్షను ధరింప చేయనున్నారు. డిసెంబర్ ఒకటవ తేదీ నుండి 15వ తేదీ వరకు అర్థమండలం అంటే ఇరవై ఒక్క రోజుల దీక్ష కార్యక్రమము ఉండగా, వీటితోపాటు 40రోజుల మండల దీక్ష కార్యక్రమం కూడా ఉండనుంది. డిసెంబర్ 14వ తేదీ పౌర్ణమి రోజున కలశ జ్యోతి కార్యక్రమాన్ని కూడా ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 21 నుండి 25 వరకు అమ్మవారి దీక్ష విరమణ కార్యక్రమాలతో పాటు డిసెంబర్ 25 ఉదయం 10గంటలకు నిర్వహించే మహా పూర్ణాహుతి కార్యక్రమంతో దీక్ష విరమణ సమాప్తి కానుంది.

- Advertisement -

దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు…
ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిదేవస్థానం ఆధ్వర్యంలో భవానీ దీక్షలు సేకరణ విరమణ మహోత్సవాలకు సంబంధించి విశేష సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్షల విరమణ స్వీకరణతో పాటు కలశ జ్యోతులు పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఇతర కార్యక్రమాల కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దీక్షా విరమణ సందర్భంగా భవానీలు గిరిప్రదక్షిణ సైతం చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లో తాగునీరు వసతి ప్రసాదాలను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement