అమరావతి, ఆంధ్రప్రభ: మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. నార్త్ బ్రేక్ వాటర్ వాల్ సౌత్ బ్రేక్ వాటర్ వాల్స్ ఒకపక్క సముద్రంలోనికి చొచ్చుకొని పోతుంటే మరోవైపు బెర్త్ ల నిర్మాణం. భూ బరువును పరీక్షించే ఫైలింగ్ టెస్టులు చురుగ్గా సాగుతున్నాయి. మచిలీపట్నం పోర్టు నిర్మాణ ప్రక్రియ నిర్ణీత గడువు 30 నెలలు కాగా, నిర్ధేశిత గడువుకు ముందే 4 బెర్తుల నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఎన్నో దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న మచిలీపట్నం పోర్టు పనులకు మే 22వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు.
మెఘా ఇంజనీరింగ్ వర్క్స్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. జూన్ నెల ఎనిమిదో తేదీన నార్త్ బ్రేక్ వాటర్ పనులకు భూమి పూజ నిర్వహించగా ఇప్పటి వరకు సముద్రంలో సుమారు 150 మీటర్ల దూరం కొండ రాళ్లు పరుచుకుంటూ పనులు ముందుకు సాగాయి. బల్క్ కార్గో స్టోర్ చేయాలంటే బెర్తులు నిర్మాణం చేసే ప్రాంతంలో నేలను పటిష్టం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బెర్తుల వద్ద బొగ్గు, ఇనుప ఖనిజం పెద్ద స్థాయిలో నిల్వ చేస్తారు.
ఆ బరువును తట్టుకునేందుకు ఫైలింగ్ టెస్ట్, సాయిల్ టెస్ట్ పనులు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత బెర్తలను డిజైన్ చేసి సముద్రంలో పూడిక తీత పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఫోర్ బ్యాక్ వాటర్ పనులలో మరొక లేయర్ పరచనున్నారు. సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణం చివరి దశకు చేరిన తర్వాత ఆరు నెలల పాటు సముద్రంలో ఆ నిర్మాణం సెటిల్మెంట్ దశ కోసం వేచి చూడాల్సి ఉంటుందని ఆ తర్వాత మరో లేయర్ ను పరుచుతామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
ఫ్లాష్‌బ్యాక్
బందరు ఓడరేవుని 400 ఏళ్ళక్రితం డచ్చివారు అభివృద్ధి చేశారు. ఈ రేవు నుంచే వారి హయాంలో ఎగుమతి దిగుమతులు జరిగేవి. డచ్చివారు దేశంనుంచివెళ్ళిపోయాక కూడా ఓడరేవు కార్యకలాపాలు దశాబ్దాల తరబడి సాగాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్లా, ఆధునిక యంత్ర సదుపాయాలు లేకపోవడం వల్ల అక్కడ కార్యకలాపాలు 40 ఏళ్ళక్రితమే పూర్తిగా స్తంభించిపోయాయి. బందరు పోర్టుని పునరుద్ధరించాలని కృష్ణాజిల్లా వాసులు దశాబ్ధాలుగా డిమాండ్ చేస్తున్నారు. 2008 ఏప్రిల్ 23న నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. 2009లో ఆయన మరణించడంతో పోర్టు పనులకు గ్రహణం పట్టింది.
2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 15 నెలల తరువాత ఆగస్టు 31వ తేదీన పోర్టు అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 24 గ్రామాల పరిధిలో 30 వేల ఎకరాల భూమి అవసరమని గుర్తించింది. దీన్లో 14,427 ఎకరాల ప్రైవేట్ భూమి సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో 15,573 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూమిని సేకరించేందుకు సిద్ధమైంది. ఇందుకు కనీసం ఆరుగ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించవలసి వుంటు-ంది. 2014 ఎన్నికలకు ముందు 2500 ఎకరాలు పోర్టు నిర్మాణానికి సరిపోతోందని చెప్పిన టీడీపీ ఆనక 30 వేల ఎకరాలు అవసరమని భూసేకరణ చేపట్టడం వివాదానికి దారి తీసింది.
దేశంలోనే మూడవ స్థానంలో ఉన్న చెన్నయ్ పోర్టు కేవలం 587 ఎకరాల్లోనే ఉంది. కొచ్చిన్ ఓడరేవు రెండు వేల ఎకరాల్లో నిర్మాణం చేశారు. మంగుళూరు 1700 ఎకరాల్లో ఉంది. విశాఖపట్నం దగ్గర కొద్దికాలంక్రితమే నిర్మించిన ప్రైవేట్ ఓడరేవు 2000 ఎకరాల్లోనే వుంది. ఈక్రమంలో ఓడరేవుకు ఎంత స్ధలం కావాలి? అన్న గందరగోళం ప్రజలను అయోమయానికి నెట్టి వేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్ బందరు పోర్టుపై ప్రత్యేక దృష్టి సారించారు.
భూవివాదాలన్నింటినీ పరిష్కరించి 1730 ఎకరాల భూమిలో 4 బెర్తులతో పోర్టు నిర్మాణం పనుల్ని ప్రారంభించారు. ఎన్నికల ముందు ఏడాదికాలం ఉందనగా పోర్టు నిర్మాణ పనులు జరుగుతాయా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు చక చక సాగడంపై ఆప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టు పనుల ప్రగతిని ప్రతినెలా 22వ తేదీన మాజీమంత్రి, స్థానిక శాసన సభ్యుడు పేర్ని నాని సమీక్షించే విధంగా షెడ్యూల్ రూపొందించారు.