హైదరాబాద్, ఆంధ్రప్రభ: గతవైభవన్ని నెమరువేసుకుంటూ రాష్ట్రంలో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది.9ఏళ్ల విరామం అనంతరం సంస్థగతంగా నాయకులను నియమించి బూత్ స్థాయికమిటీలు ఏర్పాటు చేసిన టీటీడీపీ ఎన్నికల రణక్షేత్రంలోకి దూసుకువెళ్లేందుకు రాజకీయ ప్రణాళికలను రచిస్తోంది. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలమేరకు అక్టోబర్ మొదటి వారంలో చంద్రబాబు బస్సు యాత్ర ప్రారంభించి పర్యటనలో పాల్గొనాల్సి ఉండేది.
అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండటంతో బస్సుయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసి సెలబ్రేటీలతో రోడ్ షోలు నిర్వహించేందుకు టీడీపీ పోలిట్ బ్యూరో రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ రోడ్ షోలు నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో టీడీపీ సిద్ధం అయింది.
ఇందులో భాగంగా తెలంగాణలో నిర్వహించే రోడ్ షోల్లో పాల్గొనే బాధ్యతను శాసనసభ్యుడు, సెలబ్రేటీ నందమూరి బాలకృష్ణకు టీడీపీ అధిష్టానం అప్పగించింది. ఎన్నికల నోటిఫిికేషన్ వెలుబడగానే బాలకృష్ణ రోడ్ షోలకు టీడీపీ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తోంది. ఈ రోడ్ షోలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని24 నియోజకవర్గాలను కలుపుతూ కూడళ్ళలో రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
అలాగే సినిమా నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ తెలంగాణ జిల్లాల్లో పర్యటించే ందుకు అవసరమైన ఏర్పాట్లను టీడీపీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ లోని అభిమాన సంఘాల నాయకులతో బాలకృష్ణ సమావేశాలు జరుపుతున్నారు. చంద్రబాబు రిమాండ్ నుంచి రాగానే రాష్ట్రంలో సుమారు రెండు బహిరంగ సభలు నిర్వహించేందుకు పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తోంది.
ప్రధానంగా కరీంనగర్, మహబూబ్ నగర్ లో బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం. వీటితో పాటుగా 100 నియోజకవర్గాల్లో పూర్తి చేసిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మరింత విస్తృత పరిచి గ్రామ పంచాయితీల వారిగాస్థానిక నాయకత్వంతో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేసేందుకు టీడీపీ సిద్ధమైంది.
అయితే రాష్ట్రంలో బాలకృష్ణ పర్యటిస్తే తెలుగుదేశం శ్రేణిల్లో ఉత్సాహంతో పాటుగా ఓటర్లను కదిలించే అవకాశాలు అత్యధికంగా ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అయితే బాలకృష్ణకు తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా రోడ్ షోలు నిర్వహించాల్సి ఉండటంతో ఎక్కడికక్కడ రోడ్ షోల రూట్ మ్యాప్ లను పార్టీ నాయకత్వం రూపొందిస్తోంది.